హ్యాట్సాఫ్‌ డాక్టర్‌ నరేంద్ర

31 Mar, 2020 12:59 IST|Sakshi

నెల్లూరు(అర్బన్‌): ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు డాక్టర్‌ నరేంద్ర. ఈయనకు ఇద్దరు పిల్లలు. రాష్ట్రంలో తొలి కరోనా కేసుకు వైద్యం చేసిన డాక్టర్‌.. నిత్యం వార్డులో పర్యటిస్తూ రోగులను పరామర్శిస్తూ.. వారికి ధైర్యం చెబుతున్నారు. తొలి పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి వైద్య సేవలందించి విజయవంతంగా ఆరోగ్యాన్ని బాగు చేశారు. బాధితుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కూడా అయ్యాడు. పెద్దాస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్‌ వార్డుకు ఆయన నోడల్‌ అధికారి. అయితే నాటి నుంచి నేటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారిలో, వారిని కలిసిన వారిలో జ్వరం, దగ్గు, జలుబు లాంటి అనుమానిత లక్షణాలతో ఆస్పత్రికి ప్రతిరోజూ ఒకరో, ఇద్దరో వస్తూనే ఉన్నారు. వారందరి రక్త, గళ్ల స్వాబ్‌ నమూనాలు సేకరించి పరీక్షలకు పంపే క్రమంలో డాక్టర్‌ నరేంద్ర బిజీగా ఉన్నారు. అయితే తన కోసం ఎదురుచూసే కుటుంబాన్ని, భార్యా, పిల్లలను వదిలేసి ఆరోగ్యవంతమైన సమాజం కోసం అత్యంత రిస్క్‌ను సైతం లెక్కచేయకుండా రోగులకు వైద్యం అందిస్తున్నారు. ఒకవైపు తన భార్యా, పిల్లలు గుర్తొస్తున్నా.. సమాజం కోసం ఈ డాక్టర్‌ చేస్తున్న సేవలు ఎనలేనివి.

సమాజ శ్రేయస్సే ధ్యేయం

ఈమె పేరు మిద్దె నాగేశ్వరమ్మ. దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌. భర్త, ఇద్దరు పిల్లలు, వృద్ధురాలైన తల్లితో కలిసి నెల్లూరులో నివాసం ఉంటున్నారు. ప్రతిరోజూ కుటుంబసభ్యులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి విధులకు వెళ్లేది. అలాంటిది లాక్‌డౌన్‌ ప్రారంభమైన నాటి నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా కుటుంబం కన్నా సమాజం కోసమే అధిక సమయం వెచ్చిస్తూ రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కోరోజు తెల్లవారుజాము వరకు విధులు నిర్వహిస్తున్నారు. ఇంటికి వెళ్లేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పిల్లల్ని దగ్గరకు తీసుకోవాలంటే అనేకసార్లు ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంట్లో సైతం ఆమె భౌతిక దూరాన్ని పాటిస్తున్నారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా ప్రజలకు సేవలందిస్తున్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా అనాథలు, ఇతర ప్రాంతాలకు చెందిన వారికి ప్రతిరోజూ అన్నదానం చేస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు