ఆర్‌ఎంపీలకు లైసెన్సా?

4 Nov, 2017 09:38 IST|Sakshi
దిష్టిబొమ్మ దహనం చేస్తున్న దృశ్యం

వైద్యం చేసేందుకు వారికి అర్హత ఉందా?

తక్షణమే జీవో  నంబర్‌ 465ను రద్దు చేయాలి

కర్నూలులో వైద్యులు, వైద్య విద్యార్థుల భారీ ర్యాలీ, రాస్తారోకో

కర్నూలు(హాస్పిటల్‌): తాము 15 సంవత్సరాలు కష్టపడి చదివి   డిగ్రీలు సంపాదిస్తున్నామని,  కానీ వైద్యం చేసేందుకు ఎలాంటి  అర్హత లేని ఆర్‌ఎంపీలకు ఎలా లైసెన్స్‌ ఇస్తారని సీనియర్, జూనియర్‌ డాక్టర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే జీవో నెం.465ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ  కర్నూలు మెడికల్‌ కళాశాల జూనియర్‌ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మెడికల్‌ కాలేజీలోని సీఎల్‌జీ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఆసుపత్రి ఆవరణ నుంచి  మెడికల్‌ కాలేజీ మీదుగా రాజవిహార్‌ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ వైద్యవిద్యార్థులు మానవహారం, రాస్తారోకో నిర్వహించి, తెలుగునాడు పార మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కలెక్టరేట్‌ చేరుకున్నారు. ఎన్‌టీఆర్‌ విగ్రహం వద్ద కూడా కాసేపు రాస్తా ఆందోళన చేసి కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం  వద్ద  బైఠాయించారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ రెండు రోజుల్లోగా తమ డిమాండ్‌పై  రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 52వేల మంది ఆర్‌ఎంపీల ఓట్ల కోసం తెలుగుదేశం ప్రభుత్వం వారు వైద్యం చేసేందుకు లైసెన్స్‌లు మంజూరు చేస్తోందని విమర్శించారు. వారు చేసే వైద్యంతో వేలాది మంది ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా పట్టించుకునే నాథుడు లేడన్నారు. పైగా జూనియర్‌ డాక్టర్లు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడం లేదని తమను విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  వైద్యుల పోస్టులు కాంట్రాక్టు పద్ధతిన గాకుండా రెగ్యులర్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తే  గ్రామాలకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు  జూడాలు తెలిపారు. అనంతరం జీఓ 465ను రద్దు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ కు వినతి పత్రం సమర్పించారు. వీరి ఆందోళనకు ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు డాక్టర్‌ రామకృష్ణనాయక్, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ శివశంకర్‌రెడ్డి, డాక్టర్‌ సి. మల్లికార్జున, కోశాధికారి డాక్టర్‌ రంగయ్య, జూనియర్‌ డాక్టర్ల సంఘం నాయకులు అనుదీప్, దీరజ్, శ్రీహరి, శివప్రసాద్, సతీష్‌ తదితరులు మద్దతు తెలిపి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు