ఆమె శరీరంలోకి బుల్లెట్ ఎలా వెళ్లిందో?

7 May, 2015 10:13 IST|Sakshi

* రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘటన...
 *ప్రాణాపాయం నుంచి బయటపడిన మహిళ


నరసన్నపేట: రైలుకోసం స్టేషన్‌లో ఎదురుచూస్తున్న ఓ మహిళ శరీరంలోకి ఆమెకు తెలియకుండానే బుల్లెట్ దిగబడింది. వైద్యులు కనుగొని దానిని తొలగించడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళితే..శ్రీకాకుళం జిల్లా  జలుమూరు మండలం అక్కురాడ పంచాయతీ లచ్చన్నపేటకు చెందిన శ్రీకాకుళం సత్య(28) అనకాపల్లిలో కుటుంబంతో ఉంటున్నారు. ఇటీవల జన్మించిన తన కుమారుడిని స్వగ్రామం తీసుకు వచ్చేందుకు బుధవారం విశాఖలోని మర్రిపాలెం రైల్వే స్టేషన్‌కు వచ్చారు.

 తిలారుకు టిక్కెట్ తీసుకొని రైలు కోసం ఎదురు చూస్తుండగా సత్యకు వెనక వైపు నుంచి వీపునకు ఏదో వస్తువు బలంగా తగిలింది. అయితే ఏదో రాయి తగిలి ఉంటుందని సత్య కుటుంబ సభ్యులు భావించారు. గాయపడిన ఆమెకు స్థానికంగా స్వల్ప చికిత్సను అందించి, ప్రైవేటు వాహనంలో నరసన్నపేటకు సాయంత్రం 3 గంటల సమయంలో తీసుకువచ్చారు. అక్కడకు వచ్చే సరికి గాయం తీవ్రత పెరగడంతో స్థానిక వాత్సల్య ఆసుపత్రిలో చూపించారు. పరిశీలించిన వైద్యులు ఎక్స్‌రే తీయగా అది బుల్లెట్‌గా గమనించి వెంటనే ఆపరేషన్ చేసి తొలగించారు. ప్రస్తుతం  ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు  తెలిపారు.

దూరం నుంచి  బుల్లెట్ తగలడం వల్ల ప్రమాదం తప్పిందని అన్నారు. బుల్లెట్ వెనక వైపు నుంచి శరీరీంలోనికి దూసుకు వెళ్లిన ఊపిరితిత్తులను తాకి ఉండి పోయిందని, అది మరింత బలంగా తగిలి ఉంటే ప్రాణాలకు ప్రమాదం అయ్యేదని డాక్టర్ తెలిపారు. సమాచారం తెలుసుకున్న నరసన్నపేట ఎస్ఐ చిన్నంనాయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ, వారి బందువులతో మాట్లాడారు.  నరసన్నపేట పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు శ్రీకాకుళం డీఎస్పీ భార్గవనాయుడు, సీఐ చంద్రశేఖర్ తదితరులు వచ్చి పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగింది, బుల్లెట్ ఎటువైపు నుంచి వచ్చింది అనేది తెలియడంలేదు. సత్య భర్త ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు