తల్లి గర్భంలో చిక్కుకున్న శిశువు తల

22 Apr, 2020 13:08 IST|Sakshi

కర్నూలు,బొమ్మలసత్రం: ఏడు  నెలల మృత శిశువును తల్లి గర్భం నుంచి బయటకు తీసే క్రమంలో  శరీర భాగాలు రెండుగా విడిపోయాయి. తల భాగం తల్లి గర్భంలోనే చిక్కుకుపోయింది. ఈ ఘటన మంగళవారం నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. మిడుతూరు మండలం అలగనూరు గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి, ఏసురాజు దంపతులు. శ్రీలక్ష్మికి మొదటి కాన్పులో ఆరు నెలలకే ప్రసవం జరిగి శిశువును కోల్పోయింది. ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. మంగళవారం ఉదయం కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు గడివేముల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.

అప్పటికే ఉమ్ము నీరు పోయి శిశువు కాళ్లు బయటకు రావడాన్ని వైద్యులు గమనించి.. నంద్యాల ప్రభుత్వాసుపత్రికి పంపించారు. ఇక్కడి వైద్యులు శిశువును గర్భం నుంచి బయటకు తీసే క్రమంలో  తల భాగం లోపల చిక్కుకుపోయింది. పరిస్థితి విషమించటంతో ఆమెను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శిశువు మూడు, నాలుగు రోజుల క్రితమే మృతి చెంది.. శరీరం పాచిపోవటం వల్ల విడిపోయి ఉండొచ్చని వైద్యులు తెలిపారు. కాగా..తాము ఆసుపత్రికి వచ్చే వరకు శిశువు బతికే ఉందని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని శ్రీలక్ష్మి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

మరిన్ని వార్తలు