మృతుడి చర్మం సేకరించి... కాలిన రోగికి అంటించి

16 Nov, 2019 08:16 IST|Sakshi

సాక్షి, గుంటూరు : రాష్ట్రంలో మొదటిసారి ఒక చనిపోయిన వ్యక్తి నుంచి చర్మం సేకరించి కాలిన గాయాలతో బాధ పడుతున్న రోగికి అమర్చిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని గుంటూరుకు చెందిన ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ జీఎస్‌ సతీష్‌కుమార్‌ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 18 రోజుల క్రితం తొడ, ఇతర భాగాల వద్ద చర్మం కాలి తమ వద్దకు చికిత్స కోసం వచ్చారన్నారు.

సాధారణంగా చర్మం కాలిన వారికి వారి శరీరంలోని తొడ, కాలు, చేయి, పొట్ట ఇతర శరీర భాగాల నుంచి చర్మం సేకరించి కాలినచోట అతికించి ఆపరేషన్‌ చేస్తామన్నారు. తమ వద్దకు వచ్చిన వ్యక్తికి 30 శాతం కాలిన గాయాలు ఉండటంతో పాటుగా చర్మాన్ని సేకరించేందుకు వీలు కుదరకపోవటంతో చనిపోయిన వారి నుంచి చర్మాన్ని( కెడావర్‌) సేకరించి అమర్చేందుకు నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

ముంబై లోని నేషనల్‌ సెంటర్‌ నుంచి నిల్వ ఉంచిన చర్మాన్ని సేకరించి ఐదు రోజుల క్రితం కెడావర్‌ గ్రాఫ్ట్‌ ద్వారా ఆపరేషన్‌ చేసి చర్మం అతికించామన్నారు. చర్మాన్ని సేకరించి స్కిన్‌ బ్యాంక్‌లో  ఐదేళ్ల వరకు నిల్వ ఉంచుకోవచ్చని తెలిపారు. స్కిన్‌ బ్యాంక్‌ ఉంటే కాలిన గాయాల వారు  చాలా త్వరగా కోలుకుంటారని, చనిపోయిన వారి నుంచి కళ్లు, కిడ్నీలు, గుండె సేకరించినట్టుగానే చర్మాన్ని కూడా సేకరించి కాలిన గాయాలవారి ప్రాణాలు కాపాడవచ్చని డాక్టర్‌ సతీష్‌కుమార్‌ తెలిపారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు