వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి

24 Jul, 2015 03:19 IST|Sakshi
వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి

ఆస్పత్రి వద్ద మృతుడి బంధువుల ఆందోళన
పిడుగురాళ్ళ :
గుండెనొప్పి వస్తుందని వైద్యశాలకు వెళ్లిన వ్యక్తి వైద్యుల నిర్లక్ష్యంతో శవమైన సంఘటన పిడుగురాళ్ళ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. మండలంలోని తుమ్మలచెరువు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ పొట్లసిరి సాంబశివరావు(27) పట్టణంలోని కార్పొరేట్ స్థాయి ప్రైవేటు ఆసుపత్రికి ఉదయం ఏడు గంటల సమయంలో గుండెనొప్పి అని వచ్చాడు. ఆసుపత్రిలో వైద్యుడు రాకముందే కాంపౌండర్లు రక్తపరీక్షలు, ఈసీజీ అంటూ పలు పరీక్షలు చేశారు.

వీటికి సంబంధించి  ఫీజు కూడా వసూలు చేశారు. నొప్పి తగ్గేందుకు కాంపౌండర్ ఇంజక్షన్ చేశాడు. చేసిన కొద్దిసేపటికి గుండెనొప్పి మరింత పెరిగి బాధపడుతున్నప్పటికీ,కాంపౌండర్లు ఇంజక్షన్ చేసి మొదట్లో అలాగే ఉంటుందని, తర్వాత నొప్పి తగ్గుతుందన్నారు. చివరకు నొప్పి తట్టుకోలేకపోతున్న రోగిని చూసి బంధువులు సిబ్బందిని నిలదీశారు.  తొమ్మిది గంటల సమయంలో ఆస్పత్రికి వచ్చిన వైద్యులు రోగి నోట్లో పైపును అమర్చి వైద్యం ప్రారంభించారు. ప్రాణాపాయం ఏమీ లేదని వెంటనే గుంటూరుకు తీసుకెళ్లాలని తెలపడంతో  బంధువులు అంబులెన్స్‌లో రోగిని హుటాహుటిన నోట్లో పైపు అలాగే ఉంచి గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు.

అక్కడ వైద్యులు పరిశీలించి రోగి చనిపోయి రెండు గంటలు పైగానే అయిందని నిర్థారించారు. దీంతో బంధువులు సాంబశివరావు మృతదేహాన్ని తీసుకుని పిడుగురాళ్ళ పట్టణంలోని వైద్యశాల వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. వైద్యశాల సిబ్బంది మృతుడి బంధువులతో చర్చించి రాజీ మార్గాన్ని కుదిర్చారు. అనంతరం బంధువులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. మృతుడికి తల్లి దుర్గ, భార్య వెంకటరమణ కుమార్తె లక్ష్మీభవాని, కుమారుడు సాయి గణేష్ ఉన్నారు.

మరిన్ని వార్తలు