వైద్యుల నిర్లక్ష్యం.. ఓ తల్లికి గర్భశోకం

16 Apr, 2018 08:12 IST|Sakshi
శిశువుతో ఆసుపత్రి వద్ద  ఆందోళన చేస్తున్న బాధితులు

ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన గర్భిణి

వారం రోజులుగా పట్టించుకోని వైద్యులు

కడుపులోనే శిశువు మృతి ఆందోళన చేపట్టిన బాధితులు

నంద్యాల ప్రభుత్వాసుపత్రి అద్దాలు ధ్వంసం

నంద్యాల : స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బట్టబయలైంది. కాన్పుకోసం వచ్చిన మహిళకు ప్రసవం చేయకుండా ఈరోజు, రేపు అంటూ నాన్చుడు ధోరణితో వ్యవహరించారు. దీంతో శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ బాధితు లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో ప్రభుత్వాసుపత్రి అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆదివారం చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని వీసీ కాలనీకి చెందిన హారూన్, సలీమాలకు 11సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు సంతానం. మగసంతానం కోసం ఆపరేషన్‌ చేయించుకోకుండా ఉన్నారు. సలీమా ఈనెల 7వ తేదీన కాన్పు కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. అప్పటి నుంచి వైద్యపరీక్షలు చేస్తున్న వైద్యులు కాన్పు చేయడంలో నాన్చుడు ధోరణి వ్యవహరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. శనివారం ఉదయం కాన్పు కోసం ఇంజక్షన్‌ వేసి అనంతరం కాన్పు చేయకుండా థైరాయిడ్‌ ఉందని, పరీక్షల కోసం పంపారు.

పరీక్షల్లో థైరాయిడ్‌ లేదని వచ్చిందని, ఆపరేషన్‌ చేయమని కోరినా వైద్యులు రేపు చేస్తామని పేర్కొన్నారని, ఆదివారం కూడా ఉదయం, మధ్యాహ్నం అంటూ నిర్లక్ష్యం వహించారని బాధితులు తెలిపారు. అనంతరం కడుపులో శిశువు మరణించిందని ఒకసారి, గుండెపోటుతో శిశువు మృతి చెందిందని మరోసారి పొంతనలేని జవాబులు చెప్పారని హారూన్‌ పేర్కొన్నారు. డబ్బులు లేక తాము ప్రభుత్వాసుపత్రికి వచ్చామని, వేలాది రూపాయలు జీతాలు తీసుకుంటూ నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పలుకుబడి ఉన్న వారికి మాత్రమే వైద్యం చేస్తున్నారని, పేదవారి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. 
శిశువు మృతితో ఆందోళన... 
శిశువు మృతి చెందారని తెలుసుకున్న బాధితుల బంధువులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో ఆసుపత్రి అద్దాలు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న నంద్యాల టూటౌన్‌ సీఐ శివభాస్కర్‌రెడ్డి ఆసుపత్రికి చేరుకొని బాధితులకు సర్దిచెప్పారు. విచారించి బాధితులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

మరిన్ని వార్తలు