చనిపోయారని చెప్పి చేతికిచ్చారు

28 Jun, 2020 11:17 IST|Sakshi
భద్రాచలంలో చికిత్స పొందుతున్న బాలింత సునీత

కవర్లో శిశువు కదలడంతో బయటకు తీసిన వైనం 

వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ

భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఘటన 

చింతూరు: పురిటి నొప్పులు ఆగకుండానే ఆ గర్భిణికి గుండె ఆగే మాట చెప్పారు.. పుట్టబోయే ఇద్దరు శిశువుల్లో ఒకరు చనిపోయారని అనడంతో ఆమె దుఃఖానికి అవధులు లేవు.. చివరికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఇద్దరూ చనిపోయారంటూ కవర్లో ఆ శిశువులను పెట్టి ఇవ్వడం మరింత కలచివేసింది.. కొన్ని గంటల తర్వాత ఆ కవర్లో ఓ శిశువు కదుతుందని బంధువులు చెప్పడంతో బతికి ఉన్నట్లు నిర్ధారించుకుని వైద్యానికి ఏర్పాట్లు చేశారు.. ఈ ఘటన తెలంగాణలోని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆ గర్భిణి బంధువులు ఆరోపిస్తున్నారు. వారు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. చింతూరు మండలం నరిసింహాపురం గ్రామానికి చెందిన ముచ్చిక సునీత, రవీందర్‌ దంపతులు. సునీత ఆరు నెలల గర్భిణి. శుక్రవారం ఆమెకు నొప్పులు రావడంతో చింతూరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి రిఫర్‌ చేయడంతో శుక్రవారం రాత్రి అక్కడికి తరలించారు.

ఆ ఆసుపత్రిలో ఆమెను పరీక్షించిన సిబ్బంది స్కానింగ్‌ తీయించాలని చెప్పడంతో స్కానింగ్‌ చేయించి వైద్యుడికి చూపించారు. దానిని పరిశీలించిన ఆయన కవల పిల్లల్లో ఓ బిడ్డ చనిపోయిందని శస్త్రచికిత్స చేసి చనిపోయిన బిడ్డను తీయకపోతే ఇన్ఫెక్షన్‌ సోకుతుందని చెప్పడంతో గర్భిణి బంధువులు ఒప్పుకున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు వైద్యుడు శస్త్రచికిత్స చేసిన చనిపోయిన ఆడబిడ్డతో పాటు, మరో మగబిడ్డను కూడా బయటకు తీసి ఇరువురు చనిపోయారంటూ కవర్లో పెట్టి ఇచ్చారని సునీత మామయ్య సింగయ్య తెలిపారు. సునీతకు డెలివరీ అనంతరం బాలింతలను ఉంచే వార్డులో ఉంచడంతో పాటు చనిపోయినట్లు చెప్పిన బిడ్డలను కూడా అక్కడే కవర్లో ఉంచారు.

మధ్యాహ్నం 12 గంటలకు సునీత బాబాయ్‌ సీతారామయ్య భోజనం తీసుకొచ్చి ఏం జరిగిందని అడగడంతో ఇద్దరు శిశువులు చనిపోయారని వైద్యులు చెప్పి కవరులో పెట్టి ఇచ్చారని చూపించింది. దీంతో ఆయన దగ్గరికి వెళ్లి కవర్లను చూడగా అందులో ఒక బిడ్డ కదలడంతో వెంటనే వైద్యులకు విషయం తెలిపారు. స్పందించిన వారు వెంటనే ఆ బిడ్డను హుటాహుటిన ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చావా యుగంధర్‌ వివరణ ఇస్తూ శుక్రవారం రాత్రి వారు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వచ్చారని, స్కానింగ్‌లో చనిపోయిన బిడ్డ ఉందని గుర్తించామన్నారు. బయట కూడా స్కానింగ్‌ చేయించాలని చెప్పామన్నారు. ఆ స్కానింగ్‌లో కూడా అలాగే ఉందని, దానివల్ల తల్లికి, మరో బిడ్డకు ఇన్ఫెక్షన్‌ సోకుతుందని చెప్పి శనివారం ఉదయం డెలివరీ చేసి బయటకు తీశామన్నారు. మరో బిడ్డ పరిస్థితి కూడా బాగోక పోవడంతో ఆ బిడ్డను కూడా తీసి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. పుట్టినప్పుడు రెండో బిడ్డకు శ్వాస లేదని, అంతేకాక శిశువు బరువు 500 గ్రాములు ఉండటంతో కష్టమని చెప్పి తమ సిబ్బంది వారికి సూచించారన్నారు. రెండో బిడ్డను వారు బయటకు తీసుకెళ్లారని, తిరిగి తీసుకొచ్చి ఇక్కడే ఉంచి ట్రీట్‌మెంట్‌ చేయమనడంతో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. 

ఇద్దరూ  చనిపోయారని అన్నారు 
ఉదయం 8 గంటలకు కాన్పు చేసి కవలలను తీశారు. ఇరువురూ చనిపోయారని చెప్పి కవర్లో పెట్టి ఆసుపత్రి సిబ్బంది అప్పగించారు. 12 గంటల సమయంలో నేను సునీతకు భోజనం తీసుకొని వచ్చి ఏం జరిగిందని ప్రశ్నించడంతో కవర్లో ఉన్న శిశులను చూపించింది. దగ్గరకు వెళ్లి చూడగా అందులో మగ శిశువు కదులుతుండటం గమనించి సిబ్బందికి తెలపడంతో వారు ఇంక్యూబేటర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇది ముమ్మాటికి వైద్యుల నిర్లక్ష్యమే.  
–కాకా సీతారామయ్య, సునీత బాబాయ్‌  

మరిన్ని వార్తలు