కాళ్లు మొక్కినా.. వైద్యమందక

26 Sep, 2018 12:01 IST|Sakshi

అల్లాడిపోయిన రోగులు  

వైద్యుల సమ్మెతో స్తంభించిన సేవలు  

ఓపీ సేవలు, ఆపరేషన్లు బంద్‌  

ఖాళీగా ఉన్న ఓపీ గదులు  

నిరుపేదలకు ప్రాణం మీదకు వస్తే వెంటనే గుర్తొచ్చేది ప్రభుత్వ ఆస్పత్రి. అందుకే ఇక్కడి వైద్యులను దైవంతో సమానంగా చూస్తారు. అలాంటి వైద్యులు తమ సమస్యల పరిష్కారం కోసం మంVýæళవారం నుంచి సమ్మెబాట పట్టారు. అత్యవసర సేవలు మినహా చేయిపట్టేది లేదని తేల్చిచెప్పారు. దీంతో నిత్యం వేలాది మంది వచ్చే సర్వజనాస్పత్రిలో రోగులు నరకం చూశారు. సకాలంలో వైద్యం అందక ఏడుపులు..పెడబొబ్బలు పెట్టారు. కాస్త దయచూపండంటూ కనిపించిన వారందరినీ వేడుకున్నారు. ఈ క్రమంలోనే హౌస్‌ సర్జన్లకు సూచనలిచ్చేందుకు ఓ వైద్యురాలు రాగా.. నీకాళ్లు మొక్కుతా తల్లీ నాకు వైద్యం చేయమని ఓ వృద్ధురాలు ప్రాధేయపడిన తీరు రోగుల దీన స్థితికి అద్దం పట్టింది.

ఈ వృద్ధురాలి పేరు ఈరమ్మ. మడకశిర మండలం హనుంతరాయపల్లి గ్రామం. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. రెండ్రోజులుగా ఆయాసంతో బాధపడుతూ మడకశిర ఆస్పత్రిలో చూపించుకుంది. ఎటువంటి ఫలితం లేకపోవడంతో మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకే అనంతపురం సర్వజనాస్పత్రికి వచ్చింది. ఓపీ నంబర్‌ 15కు ఎంతసేపటికీ వైద్యులు రాలేదు. ఇదేమిటని ఆరా తీస్తే వైద్యుల సమ్మె అని తెలిసింది. దీంతో ఆ వృద్ధురాలి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. రూ 250 ఖర్చు పెట్టుకుని ఇక్కడకు వస్తే వైద్యులు లేకపోతే ఎలాగని కన్నీటి పర్యంతమైంది. ఆయాసం వస్తోందయ్యా ఏంటి నా పరిస్థితితని బోరున విలపించింది.  

అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో వైద్యుల సమ్మెతో రోగులు ప్రత్యక్ష నరకం చూశారు. మంగళవారం సమ్మెలో భాగంగా ఆస్పత్రిలోని ఓపీ గదులను వైద్యులు మూసేసి ధర్నాలో పాల్గొన్నారు. వైద్యులు ఓపీ బ్లాక్‌ ముందే సేవలు లేవని రోగులకు తెగేసి చెప్పారు. నిత్యం కిటకిటలాడే ఓపీ విభాగాలు బోసిపోయాయి. అత్యవసరం మినహా మిగతా ఆపరేషన్లను వాయిదా వేశారు. విద్యార్థులకూ బోధన తరగతులు తీసుకోలేదు. ఇంకా సమ్మె మూడ్రోజుల పాటు ఉండడంతో రోగులు మరింత ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు.  

ప్రభుత్వ వైద్యులపై చిత్తశుద్ధేదీ?
ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఓపీ బ్లాక్‌ ముందు ధర్నా చేపట్టారు. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ రామస్వామినాయక్, డాక్టర్‌ వీరభద్రయ్య మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యుల పట్ల సర్కార్‌ చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికే ఏళ్ల తరబడి పదోన్నతులకు నోచుకోకుండా ఇబ్బందులు పడుతుంటే రిమ్స్‌ వైద్యులను ప్రభుత్వ వైద్యులుగా గుర్తించడమేంటని నిలదీశారు. దీని ద్వారా సీనియర్‌ వైద్యులు నష్టపోవడమే కాక, ఒకే కేడర్‌లో ఉద్యోగ విరమణపొందుతారన్నారు. పీఆర్‌సీ అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారమయ్యే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు.  

27న మహాధర్నా
ఆస్పత్రిలో మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్‌తో వైద్యుల సంఘం నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్‌ మాట్లాడుతూ డీఎంఈ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారని చెప్పారు. అందుకు ప్రభుత్వ వైద్యుల సంఘం స్పందిస్తూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఇవ్వాలని డీఎంఈ ఇస్తే కుదరదన్నారు. ఈ నెల 26న విధులను బహిష్కరిస్తామని, 27న జూనియర్‌ డాక్టర్లు, స్టాఫ్‌నర్సులు, పారామెడికల్‌ సిబ్బందిని కలుపుకుని మహాధర్నా చేపడుతామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యుల సంఘం కోశాధికారి డాక్టర్‌ భానుమూర్తి, వైద్యులు డాక్టర్‌ నాగేంద్ర, డాక్టర్‌ వెంకటరమణ, డాక్టర్‌ మల్లికార్జున, డాక్టర్‌ షంఫాద్‌బేగం, డాక్టర్‌ మల్లీశ్వరి, డాక్టర్‌ సుల్తానా, డాక్టర్‌ హేమలత, డాక్టర్‌ సుబ్రమణ్యం, డాక్టర్‌ మహేష్, డాక్టర్‌ ప్రవీణ్‌దీన్‌కుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు