ఆపరేషన్‌కు వస్తే.. ఆయువు తీసేశారు!

17 Dec, 2018 08:05 IST|Sakshi
చాందిని మృతదేహంపై పడి విలపిస్తున్న తల్లి రమా చిగిలిపల్లి చాందిని (ఫైల్‌ ఫొటో)

వైద్యుల నిర్లక్ష్యానికి తొమ్మిదేళ్ల         చిన్నారి మృత్యువాత

వికటించిన టాన్సిల్స్‌ ఆపరేషన్‌

ఆస్పత్రి ఎదుట కుటుంబ     సభ్యులు, బంధువుల ఆందోళన

శ్రీకాకుళం న్యూకాలనీ /పొందూరు: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలైపోయింది. టాన్సిల్స్‌ ఆపరేషన్‌ వికటించడంతో తొమ్మిదేళ్ల చిన్నారి మృత్యువాతపడింది. ఈ విషాద ఘటన జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..పొందూరు మండలం అలమాజీపేట గ్రామానికి చెందిన చిగిలిపల్లి శ్రీనివాసరావు, రమా దంపతులకు ఇద్దరు పిల్లలు. తొమ్మిదేళ్ల కుమార్తె చాందిని (4వ తరగతి), ఏడేళ్ల కుమారుడు సాయిచందన్‌(3వ తరగతి) కింతలిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. శ్రీనివాసరావు జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, రమా గృహిణి. చాందినికి వారం రోజుల క్రితం మెడ వద్ద టాన్సిల్స్‌ సమస్య రావడంతో  శ్రీకాకుళం డేఅండ్‌నైట్‌ జంక్షన్‌ వద్ద ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ కింతలి సోమేశ్వరరావుకు వద్దకు తీసుకెళ్లారు.

ఆపరేషన్‌ చేసి టాన్సిల్స్‌ తీయాల్సి ఉంటుందని చెప్పడంతో సరేనని తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. అయితే వైద్యుడికి సొంతంగా ఆపరేషన్‌ థియేటర్‌ లేకపోవడంతో సురక్ష కిడ్నీ మెటర్నిటీ హాస్పిటల్‌లో ఆపరేషన్‌ చేయడానికి ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం చాందినిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం 5.30 గంటలకు ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లారు.లోపలికి వెళ్లిన రెండు గంటల  తర్వాత హార్ట్‌పల్స్‌రేట్‌ సరిగా లేదని.. కార్డియాలజిస్ట్‌కు పిలిచామని వైద్యులు తల్లిదండ్రులకు చెప్పారు. మరో 30 నిమిషాల తర్వాత పాప చనిపోయిందని చావుకబురు చల్లగా చెప్పారు. దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత..
పాప చనిపోయిందని సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. తమ పాపని ఏం చేశారో చెప్పాలని డాక్టర్లను నిలదీయడంతో వారంతా బిక్కమొహం వేశారు. ఒకానొక దశలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు, ప్రైవేటు డాక్టర్ల సంఘ ప్రతినిధులు రంగ ప్రవేశం చేసి బంధువులను సముదాయించారు. అనస్థీషియా పనిని కూడా డాక్టర్‌ కింతలి సోమేశ్వరరావే చేయడంతోనే ఈ దుస్థితి తలెత్తిందని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. డ్రగ్‌ డోస్‌ ఎక్కువగా ఇవ్వడంతో బ్రెయిన్‌ పనిచేయడం మానేసి.. హార్ట్‌పల్స్‌ రేట్‌ పడిపోయి పాప ప్రాణాలు విడిచిందని పరిశీలనకు వచ్చిన వైద్యులు గుర్తించారు. పాప మృతి చెందిన తర్వాత ముక్కు, చెవుల నుంచి రక్తం ధారకట్టింది. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పజెప్పడంతో సాయంత్రం అలమాజీపేటలో దహనసంస్కారాలు పూర్తిచేశారు. కాగా, ఈ ఘటన విషయంలో ఇరువర్గాలకు రాజీ కుదిరినట్లు తెలిసింది. 

అలమాజీపేటలో విషాదఛాయలు..
చిన్నారి చాందిని స్వగ్రామం అలమాజీపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. నిన్నమొన్నటి వరకు తమతోనే ఉన్న కుమార్తె ఇక లేదని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అక్క ఎందుకు రాలేదని తమ్ముడు సాయిచందన్‌ అడుగుతుండటం స్థానికులను కంటతడి పెట్టించింది.

మరిన్ని వార్తలు