బెడ్‌లు ఖాళీ లేవు..!

2 Feb, 2019 13:13 IST|Sakshi
కళావతిని అత్యవసర విభాగంలోకి తరలించి వైద్యం అందిస్తున్న సిబ్బంది, పక్కన కుమారుడితో ఏసురత్నం

పక్షవాతం రోగిని వార్డులోకి చేర్చుకునేందుకు నిరాకరించిన వైద్యులు

అత్యవసర విభాగం వెలుపల అస్వస్థతకు గురై పడిపోయిన మహిళ    

స్పీకర్‌ ఆసుపత్రిలో ఉండటంతో హడావుడిగా మహిళను వార్డులోకి తరలించిన వార్డు సిబ్బంది

గుంటూరు ఈస్ట్‌: పాక్షికంగా పక్షవాతం వచ్చిన మహిళను జీజీహెచ్‌ అత్యవసర విభాగంలో ఇన్‌పేషెంట్‌గా చేర్చుకోకపోవడంతో ఆమె వార్డు వెలుపల తీవ్ర అస్వస్థతకు గురై పడిపోయింది. అదే సమయంలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉండటంతో వైద్య సిబ్బంది ఆమెను హడావుడిగా అత్యవసర విభాగంలోకి తరలించారు. వివరాల్లోకి వెళితే గుంటూరు ఏటీ ఆగ్రహారానికి చెందిన వి.ఏసురత్నం ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తుంటాడు. అతని భార్య కళావతి 3 నెలలుగా పాక్షిక పక్షవాతంతో అనారోగ్యానికి గురికాగా, ఆమెకు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించాడు.అయితే అక్కడ వేసే బిల్లులు భరించలేక శుక్రవారం మధ్యాహ్నం జీజీహెచ్‌ అత్యవసర విభాగానికి తీసుకువచ్చాడు.

అత్యవసర విభాంగలో వైద్యులు కళావతికి పరీక్షలు చేయించి మందులు రాసి ఇచ్చారు. ఇన్‌పేషెంట్‌గా చేర్చుకునేందుకు బెడ్‌లు ఖాళీ లేవని నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక ఏసురత్నం భార్యను తీసుకుని వార్డు వెలుపలకు వచ్చాడు. తమ వెంట వచ్చిన బంధువును కళావతి వద్ద తోడుగా ఉంచి ఆటో తీసుకువచ్చేందుకు బయటకు వెళ్లాడు. ఆ సమయంలో స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ఆసుపత్రి ప్రాంగణంలో ఉండటంతో పోలీసులు ఆటోను లోపలకు అనుమతించలేదు. చేసేదేమీ లేక ఏసురత్నం తిరిగి భార్య వద్దకు రాగా, కళావతి ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురై అదుపు తప్పి కింద పడిపోయింది. స్పీకర్‌ ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉండటంతో వైద్య సిబ్బంది హడావుడిగా కళావతిని అత్యవసర విభాగంలోకి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఇన్‌పేషెంట్‌గా చేర్చుకుని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని ఏసురత్నం కన్నీళ్ల పర్యంతం అయ్యాడు.

మరిన్ని వార్తలు