విటమిన్‌ ‘డి’ని కాపాడుకోవాల్సిందే

13 Jul, 2020 04:15 IST|Sakshi

కరోనాను ఎదుర్కొనేందుకు విటమిన్‌‘డి’ తప్పనిసరంటున్న వైద్యులు

ఇమ్యూనిటీ వ్యవస్థ మెరుగుకు కీలకం

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందాక విటమిన్‌ల గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఎక్కడ చూసినా వైరస్‌ను తట్టుకోవాలంటే ఎలాంటి విటమిన్‌లు ఉన్న ఆహారం తీసుకోవాలి, ఏఏ మాత్రలు వాడాలి అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత కరోనా సమయంలో ముఖ్యంగాశరీరంలో విటమిన్‌ డి లోపం లేకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్‌–డి ఇమ్యూనిటీ వ్యవస్థను మెరుగు పరుస్తుంది కాబట్టి కరోనా వైరస్‌ సోకినా తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యం ఉంటుందని వారు చెబుతున్నారు.

విటమిన్‌ డి ఎందుకు అవసరం అంటే.. 
► విటమిన్‌ డి ఇమ్యూనిటీ (వ్యాధి నిరోధక శక్తి) వ్యవస్థను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
► ఎముకల సాంద్రతకు ఇతోధికంగా ఉపయోగపడుతుంది.
► నాడీ, మెదడు వ్యవస్థలు పనిచేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.
► ఊపిరితిత్తుల పనితీరులోనూ, గుండె జబ్బుల నియంత్రణలోనూ ఎంతగానో ఉపయోగపడుతుంది.
► శరీరంలో కాల్షియం, ఫాస్పరస్‌ నిల్వలను నియంత్రిస్తుంది.
► విటమిన్‌ డి సూర్యరశ్మి ద్వారా వస్తుంది. మాత్రలు తీసుకోవడం ద్వారానూ దీన్ని పెంపొందించుకోవచ్చు.

కీలక పాత్ర  పోషిస్తుంది
ప్రస్తుత కరోనా సమయంలో విటమిన్‌ డి లోపం లేకుండా చూసుకోవాలి. విటమిన్‌ డి శరీరాన్ని నీరసపడకుండా చూస్తుంది. ఇది లోపిస్తే చాలా ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రక్తపరీక్షలు చేయించుకోవడం ద్వారా విటమిన్‌ డి లోపాలు తెలుసుకోవచ్చు.       
– డా.బొబ్బా రవికిరణ్, క్యాన్సర్‌ వైద్య నిపుణులు

మరిన్ని వార్తలు