క్రమం తప్పితే ముప్పే!

12 Jul, 2019 09:45 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : మధుమేహ వ్యాధి మెరుగైన నియంత్రణకు మంచి జీవనశైలితో పాటు, మందులు కచ్చితంగా వాడటం ఎంతో ముఖ్యమైన విషయం. మందులు వాడకంలో ఏ మాత్రం తేడా వచ్చినా శరీరంలో సుగర్‌ లెవల్స్‌ అదుపు తప్పుతాయి. ప్రస్తుతం మధుమేహంతో బాధపడుతూ మందులు వాడుతున్న వారిలో సగం మందికిపైగా తమ శరీరంలో సుగర్‌ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోలేకపోతున్నారు. అందుకు సరైన పద్ధతిలో,  వైద్యులు సూచించిన విధంగా మందులు వాడకపోవడమే కారణాలుగా తేలింది. ఇటీవల మధుమేహం అదుపులో లేకపోవడానికి క్లినికల్‌ ఫార్మసిస్టులు చేసిన అధ్యయనాల్లో మందులు సరిగ్గా వాడక పోవడమే కారణంగా తేలింది. క్రమం తప్పకుండా మందులు వేసుకోవడం ఎలా?. దాని ప్రాముఖ్యం, రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుందాం.

వైద్యులు చేయాల్సినవి...

  • తమ వద్దకు వచ్చిన రోగులకు మెరుగైన సుగర్‌ నియంత్రణ మందులు ఇవ్వగలగాలి 
  • చికిత్స ఫలితం ఆలస్యంగా ఉంటుందని, క్రమం తప్పకుండా మందులు వాడితే ఫలితం ఉంటుందని రోగికి ఓపిగ్గా వివరించగలగాలి.
  • 12 నుంచి 15 రకాల మందులు రాయడం, చేతిరాత అర్థం కానటువంటి మందులు రాయడం చేయరాదు.
  • తాము రాసే బిళ్లలు ఎప్పుడు వేసుకోవాలి? ఎలా వేసుకోవాలో వివరించడంతో పాటు, ఏ మందులు దేనికి పనిచేస్తుందో తెలియజెప్పాలి.
  • నూతన ఇన్సులిన్‌ విధానం సులభతరంగా ఉండాలి.
  • ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ డ్రగ్స్‌ రాయడం వలన ప్రిస్కిప్షన్‌లో మందుల సంఖ్య తగ్గించవచ్చు.

రోగులు చేస్తున్న తప్పులు

  • ప్రయాణాలు, శుభకార్యాల సమయంలో మందులు వేయడం మర్చిపోతుంటారు.
  • మందులు రోజులో నాలుగుసార్లు వేసుకోవాల్సి ఉంటే.. రెండు, మూడుసార్లు వేసుకుని సరిపెట్టడం.
  • మతిమరపు కారణంగా ఒకసారి మందులు వేసుకున్న తర్వాత సుగర్‌ లెవల్స్‌ చెక్‌ చేసుకుని ఆపివేస్తుంటారు.
  • కుటుంబం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం. అంటే ఏ సమయానికి మందులు వేసుకోవాలి, ఏ మందు వేసుకోవాలో తెలిపే వారు లేకపోవడం. 
మరిన్ని వార్తలు