అమ్మ బతికే ఉందా?

15 Nov, 2014 03:20 IST|Sakshi
అమ్మ బతికే ఉందా?

ఓ ప్రధాన పార్టీ అనుబంధ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడు అనంతపురంలోని తన స్నేహితుడు ఎర్రిస్వామి ఇంటికి తరచూ వెళ్లేవాడు. ఈ క్రమంలో అతని భార్య ఇంట్లోంచి మాయమైంది. కంబదూరులో మహిళ మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసులకు ఎర్రిస్వామి కూడా ఫిర్యాదు చేశాడు. ఇపుడు ఆమె బతికే ఉందా.. లేదా అని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేయూలని డీజీపీ నుంచి జిల్లా పోలీసులకు ఆదేశాలందారుు. ఏం జరిగిందో కానీ పోలీసులు ఇప్పటి వరకు ఆ కేసు సంగతి తేల్చలేదు. దీంతో ఎర్రిస్వామి పిల్లలు ఏడాదిగా పడుతున్న ఆవేదన వారి మాటల్లోనే..

 
 సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘మా పేర్లు అమృతకర్, వర్షిత్‌కర్. ఎర్రిస్వామి, సుజాతల ముద్దుల కొడుకులం. మమ్మల్ని మా అమ్మా నాన్న ఎంత ప్రేమగా చూసుకున్నారో.. వారిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్లో మాటల్లో చెప్పలేం. ఏం జరిగిందో.. ఏమో తెలీదు. ఏడాది నుంచి మా అమ్మ కన్పించడం లేదు. అమ్మ ఎక్కడికెళ్లింది నాన్నా.. అంటే పనిపై ఊరికెళ్లింది...త్వరలో వస్తుంది కన్నా అని చెబుతున్నాడు. చాలా రోజులైనా అమ్మ రాలేదు. మళ్లీ అడిగాం.

నాన్న నోటి నుంచి మరో రకమైన సమాధానం. ఎప్పుడు అమ్మ గురించి అడిగినా.. అదిగో వస్తుంది.. ఇదిగో వస్తుందని చెబుతున్నాడు కానీ అమ్మ రాలేదు. కళ్లనిండా నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నాడు. ఏం జరిగిందో మాకు తెలీదు.. ఏదో జరిగిందని మాత్రం తెలుస్తోంది. అమ్మ కనిపించలేదని కంబదూరు పోలీసు స్టేషన్‌లో మా తాతయ్య ఫిర్యాదు చేశాడు. అమ్మ ఎక్కడుందో మాకే కాదు.. నాన్నకూ తెలీదని అప్పుడు తెలిసింది. అమ్మ లేదని నాన్న రోజూ వేదనపడుతున్నాడు.

సరిగా అన్నం తినేవాడు కాడు. రాత్రింతా మేల్కొని దిగాలు కూర్చున్న రోజులు ఈ ఏడాదిలో ఎన్నో. మా అమ్మలేదని ఇరుగుపొరుగు వారూ అడుగుతున్నారు. ఉదయం బడికి వెళ్లేముందు పిల్లలందరూ ‘బాయ్...మమ్మీ’ అంటుంటే మా అమ్మ గుర్తొస్తుంది. భరించలేని బాధేస్తోంది. అమ్మచేతి ముద్ద తినక, అమ్మ ఒడిలో పడుకోక ఎన్ని రోజులైందో.. అమ్మ లేదని, మా ఆలనాపాలన చూసుకునేవారు లేరని కుమిలి కుమిలి మా నాయనమ్మ చనిపోయింది.

దీంతో మాకు అన్నం చేసేదిక్కు కూడా లేకుండా పోయింది. మా బాధకు తోడు అమ్మమ్మ చనిపోయిందనే బాధతో మా తాతయ్య(నాన్న నాన్న) కూడా చనిపోయాడు. అమ్మ ఎక్కడుందో తెలీదు.. నాయనమ్మ, తాతయ్య చనిపోయారు. ఇవన్నీ నాన్నను మరింత కుంగదీశాయి. మా నాన్న పేరు ఎర్రిస్వామి అని ఎందుకు పెట్టారో తెలీదు కాని... ఇటీవల నిజంగా ఎర్రోడైపోయాడు. ఈ బాధ భరించలేను.. ఆత్మహత్య చేసుకుంటా అంటాడు. ‘నేనూ చనిపోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు కన్నా’ అని మమ్మల్ని ఒళ్లోకి తీసుకుని తలపై చేతితో తడుముతూ బోరున ఏడుస్తాడు.

నాన్న బాధ చూస్తే ముగ్గురం మూకుమ్మడికి చచ్చిపోదామా.. అనిపిస్తుంది. బాధను దిగ మింగుకుని అలా కాలం గడుపుతున్నాం. అమ్మ కనిపించలేదని నాన్న పోలీసులకు చెప్పాడు. డీజీపీకి కూడా చెప్పారంట. అయినా ఫలితం లేదు. ఏం చేద్దాం దేవుడు మాకు ఇలా రాసిపెట్టిఉంటే ఎవరేం చేస్తారు. ‘ఎస్పీ అంకుల్.. మాదో ఓ చిన్న విన్నపం. మా అమ్మ బతికే ఉందా? చనిపోయిందా? ఇదొక్క విషయం చెప్పండి. ఎందుకంటే అమ్మను చంపేశారని రకరకాల మాటలు వినిపిస్తున్నాయి.

బతికి ఉండి మా వద్దకు వస్తే చాలా సంతోషం. రాకపోయినా ఫర్వాలేదు. బతికి ఉందని తెలిస్తే చాలు. అమ్మ... అప్పటి అమ్మ కాదని మరిచిపోతాం. లేదు చంపేశారా! అదైనా చెప్పండి. రోజూ వేదనపడకుండా ‘అమ్మలేదు ఎంత బాధపడినా రాదు’ అని నాన్నను ధైర్యంగా చూసుకుంటాం. ఆయన ఒడిలో మరింత ధైర్యంగా బతుకుతాం. ‘ఎస్పీ రాజశేఖర్‌బాబు మంచి ఆఫీసర్ అని, అందరికీ న్యాయం చేస్తార’ని అంతా అనుకుంటున్నారు. పేపర్లో ఇటీవల మీ ఇంటర్వ్యూ కూడా చూశాం. ఏ సమస్య ఉన్నా చిన్న ఎస్‌ఎంఎస్ పంపండి స్పందిస్తాం అని చెప్పారు. ఇదంతా ఎస్‌ఎంఎస్ పంపడం చేతకాదు. రెండు చేతులు జోడించి మేం వేడుకుంటున్నాం. మా అమ్మ సంగతి తేల్చరూ.. ప్లీజ్ అంకుల్.. ప్లీజ్..’

మరిన్ని వార్తలు