ఆ ఎయిమ్స్ ఉందా?

21 Jun, 2014 02:26 IST|Sakshi
ఆ ఎయిమ్స్ ఉందా?

రాష్ట్రానికి ఎయిమ్స్ తరహా సంస్థను మంజూరు చేసిన కేంద్రం
దీన్ని తన్నుకుపోయేందుకుకోస్తా నేతల యత్నం
జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మేల్కోకపోతే తీవ్ర నష్టం
ఎయిమ్స్ ఏర్పాటైతే అభివృద్ధి పథంలో పయనించనున్న ‘అనంత’

 
అనంతపురం :వైద్య, ఆరోగ్య రంగంలో జిల్లా అనంత దూరంలో వెనుకబడింది. రాయలసీమలోని మిగతా జిల్లాలతో పోల్చినా ఇక్కడ చెప్పుకోదగ్గ ఆస్పత్రి లేదు. కర్నూలులో ఎప్పటి నుంచో అభివృద్ధి చెందిన బోధనాస్పత్రి (మెడికల్ కాలేజీ, జనరల్ ఆస్పత్రి) ఉంది. చిత్తూరు జిల్లా తిరుపతిలో శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (సిమ్స్), కడపలో రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (రిమ్స్) ఉన్నాయి. ఎటొచ్చీ అనంతపురం జిల్లాలోనే చెప్పుకోదగ్గ ఆస్పత్రి లేదు. ఉన్న 500 పడకల సర్వజనాస్పత్రి నిధుల కొరత, సౌకర్యాల లేమితో అల్లాడుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో అనంతపురం పరిస్థితి మరింత దయనీయంగా మారింది. జిల్లా వెనుకబాటు తనాన్ని చూసి కాకపోయినా..12 మంది ఎమ్మెల్యేలను అందించినందుకైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ‘అనంత’ అభివృద్ధిపై శ్రద్ధ చూపాల్సిన అవసరముందన్నది ‘అనంత’ ప్రజానీకం అభిప్రాయం. ఇలాంటి తరుణంలో ప్రతిష్టాత్మక ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) తరహా సంస్థను ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన మేర భూమిని సేకరిస్తే, మిగతా ఖర్చంతా కేంద్రమే భరించి అత్యున్నత ప్రమాణాలతో వైద్యవిజ్ఞాన సంస్థను ఏర్పాటు చేస్తుంది.

ఈ ప్రాజెక్టును కూడా తరలించుకుపోయేందుకు అధికార పార్టీకి చెందిన కోస్తా ప్రాంత నేతలు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో అన్నిరంగాల్లో వెనుకబడ్డ అనంతపురం జిల్లాకు ఈ ప్రాజెక్టును తీసుకొచ్చేందుకు  జిల్లా ప్రజాప్రతినిధులు ఏ మేరకు చొరవ చూపుతారన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యర్థులపై దాడులు చేయించడం, వారి తోటలను నాశనం చేయించడం లాంటి సంకుచిత చర్యలపై మాత్రమే దృష్టి సారించకుండా  జిల్లా అభివృద్ధిపై దృష్టి  పెట్టాలని ప్రజలు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో సీమ జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే సూచనలు కనిపించడం లేదు. కనీసం కేంద్రం పూర్తిగా  నిధులు చేకూర్చే ఇలాంటి ప్రాజెక్టుల ఏర్పాటులోనైనా వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లాలోని మేధావులు కోరుతున్నారు. కాగా, ‘ఎయిమ్స్’ను తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చొరవతో 1956లో ఢిల్లీలో ఏర్పాటు చేశారు. అప్పట్లో మన నాగార్జునసాగర్ డ్యాంను, ఎయిమ్స్‌ను నెహ్రూ ‘ఆధునిక దేవాలయాలు’గా అభివర్ణించారు.
 2012లో ఎయిమ్స్ తరహా ఇన్‌స్టిట్యూట్లను భోపాల్, భువనేశ్వర్, జోధ్‌పూర్, పాట్నా, రాయ్‌పూర్‌లలో ఏర్పాటు చేశారు.

ఎయిమ్స్ తరహా సంస్థ ఏర్పాటైతే?

*  వైద్య, ఆరోగ్య రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు అందుబాటులోకి వస్తాయి.
* దాదాపు 50 విభాగాల్లో అత్యున్నత స్థాయి వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది.
* టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది దాదాపు 8 వేల మంది ఉంటారు.
* ఎంబీబీఎస్, పీజీ, నర్సింగ్, పారా మెడికల్, మెడికల్ టెక్నాలజీ, మెడికల్ బయోటెక్నాలజీ తదితర కోర్సుల్లో వేలమంది విద్యార్థులకు సీట్లు దొరుకుతాయి.
*అన్ని విభాగాల్లో కలుపుకుని దాదాపు రెండు వేల పడకల సామర్థ్యంలో ప్రజలకు అంతర్జాతీయ స్థాయి వైద్యం లభిస్తుంది.
 అనుకూలతలెన్నో

 ‘ఎయిమ్స్’ ఏర్పాటుకు జిల్లాలో చాలా అనుకూలతలు ఉన్నాయి. ‘లేపాక్షి నాలెడ్జ్ హబ్’ కోసం సేకరించిన 12 వేల ఎకరాల భూములు సిద్ధంగా ఉన్నాయి. హిందూపురం ప్రాంతంలో సేకరించిన ఈ భూములు బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఉన్నాయి. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా వంద కిలోమీటర్లలోపే ఉంటుంది.
 ప్రాజెక్టు ఏర్పాటుకు అన్ని అనుకూలతలూ ఉన్న నేపథ్యంలో దాన్ని రాబట్టేందుకు జిల్లా ప్రజాప్రతిధులు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరముంది.
 

మరిన్ని వార్తలు