రెండో రోజూ అదే కుక్క... వదల్లేదండి పిక్క

27 Feb, 2019 08:09 IST|Sakshi
కుక్కదాడిలో గాయపడి కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

వాడపల్లి నుంచి వానపల్లి వరకూ తీర గ్రామాల్లోని ప్రజలపై దాడి

ఆస్పత్రులపాలైన 30 మంది బాధితులు

తూర్పుగోదావరి, కొత్తపేట: నియోజకవర్గ పరిధిలోని పలు వరుస గ్రామాల్లో ఓ కుక్క సుమారు 30 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. క్షతగాత్రులు అందరూ తెల్ల కుక్క కరిచిందని చెబుతున్న దాన్నిబట్టి ఒకే కుక్క అందరిపైనా దాడికి పాల్పడినట్టు భావిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకూ  సుమారు 20 మంది కుక్కదాడిలో గాయపడిన బాధితులు కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. కొందరు చికిత్స పొంది వెళ్లిపోగా, తీవ్రంగా గాయపడిన వారు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. గౌతమీ గోదావరి పరీవాహక (ఏటిగట్టుకు బయట, లోపల) వాడపల్లి నుంచి వానపల్లి వరకూ గల గ్రామాల్లో ప్రజలపై కనీ వినీ ఎరుగని రీతిలో విచిత్రంగా ఓ కుక్క దాడి చేసి గాయపరిచింది. పనులు చేసుకుంటుండగా, ఇంటి వరండాలో పడుకుని ఉండగా హఠాత్తుగా దాడి చేసి గాయపరిచిందని క్షతగాత్రులు చెబుతున్నారు.

ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామానికి చెందిన కుప్పాల కనకారావు, శనక్కాయల ఏసు, రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామానికి చెందిన తిరుమల పుల్లమ్మ, ఇళ్ల వీరవెంకటలక్ష్మి, నక్కా చిట్టియ్య, గుర్రాల అమ్మాజీ, కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామానికి చెందిన బండారు వెంకటరత్నం, రావులపాలెం గ్రామానికి చెందిన కిలుగు రామ్మూర్తి, కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన ర్యాలి పోతురాజు, కండ్రిగ గ్రామానికి చెందిన గుబ్బల అర్జునరావులపై కుక్క దాడి చేసింది పలువురిని చేతులు, కాళ్లు, నడుము బాగాలపై కరిచి తీవ్రంగా గాయపరిచింది. దీంతో వారు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వానపల్లి గ్రామానికి చెందిన వాసంశెట్టి పెంటారావు, కొత్తపేట బోడిపాలెంకు చెందిన ఉంగరాల భరత్‌కుమార్, వీదివారిలంకకు చెందిన తాడింగి లార్డ్, పంగి మీనాక్షి, మట్టపర్తి సత్యవతి, మట్టపర్తి నారాయణరావు, కేదార్లంకకు చెందిన తాడంగి గణేష్, రావులపాలెంకు చెందిన పొడాలి హైమావతి, కొమరాజులంకకు చెందిన గుర్రాల హైమజ్యోతి, నాతి చిట్టియ్య, అల్లాడి శ్రీను, పి.భవాని, బానుపాటి రాముడు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందారు. వీరు కాకుండా కుక్క దాడిలో గాయపడ్డ మరో 10 మంది ఆయా గ్రామాల్లోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందినట్టు స్థానికులు తెలిపారు.

మొన్న చిరుత... నేడు కుక్క  
గోదావరి పరీవాహక ప్రాంత గ్రామాల్లో మొన్న చిరుత పులి ప్రవేశించి నలుగురిపై దాడి చేసి ప్రజలను భయబ్రాంతులను చేసింది. ఎట్టకేలకు గౌతమీ గోదావరి తీరం వెంబడి ముమ్మిడివరం సమీపంలోని గేదెల్లంక గ్రామానికి చేరుకుని అక్కడ చిక్కిన విషయం తెలిసిందే. దాంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా అదే తీరం వెంబడి వరుస గ్రామాల్లో ఒకే కుక్క ప్రజలపై దాడిచేసి తీవ్రంగా గాయపరచడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పలు గ్రామాల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉందని ప్రజలు చెబుతున్నారు. గ్రామ పంచాయతీల సిబ్బంది అప్రమత్తమై ప్రస్తుతం 30 మందిని గాయపర్చిన తెల్లకుక్కతో పాటు గ్రామాల్లోని కుక్కలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు