టీడీపీలో నువ్వా..నేనా..

9 Apr, 2014 02:29 IST|Sakshi

 సాక్షి, ఒంగోలు: తెలుగుదేశం, బీజేపీ పొత్తు జిల్లాలో తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. సీనియర్ నేత కరణం బలరాంతో పాటు జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ కలిసి ఎవ రికి వారు సొంతవర్గాలను ప్రోత్సహిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. పొత్తు ఖరారైన వెంటనే ఒంగోలులోని పార్టీ కార్యాలయ ధ్వంస రచనకు కరణం బలరాం సూత్రధారిగా వ్యవహరించారని దామచర్ల వర్గం ఆరోపిస్తోంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్‌ను టీడీపీలోకి తెచ్చుకోవడంలో కరణం బలరాం విజయవంతమయ్యారు. ప్రాదేశిక సమరంలో టీడీపీ అభ్యర్థుల గెలుపునకు ఆర్థిక సహకారం అందించేందుకు బీఎన్ విజయ్‌కుమార్ కూడా సిద్ధమయ్యారు.

అంతలో సంతనూతలపాడును బీజేపీకి కేటాయించడంతో విజయ్ వర్గం నీరుగారింది. అంతేకాక బీజేపీ తీర్థం పుచ్చుకున్న దారా సాంబయ్యను గెలిపించాలని చంద్రబాబు నుంచి వచ్చిన ఆదేశాలు స్థానిక కేడర్‌కు మింగుడు పడలేదు.  బలరాం అనుచరులను సైతం షాక్‌కు గురిచేసింది. ఈ క్రమంలో బలరాం తెరవెనుక ఉండి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయించడం, డెయిరీలో సమావేశం ఏర్పాటు చేయించడం, హైదరాబాద్ వెళ్లి హడావుడి చేయించడం జరుగుతోందని దామచర్ల వర్గం  వేగుల ద్వారా అధినేతకు నివేదిక పంపింది.

 కొండపి సీటుకు ఎసరుపెట్టిన బలరాం
 ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టిన కాంగ్రెస్‌ను కాదని టీడీపీలోకొస్తే ఇటువంటి పరాభవం జరగడమేంటని రాజకీయ భవిష్యత్‌పై లెక్కలేస్తూ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ డీలా పడినట్టు తెలుస్తోంది. మంగళవారం జరిగిన  చర్చల్లో సంతనూతలపాడు బదులు కొండపి స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తున్నట్లు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అక్కడ  దారా సాంబయ్యను నిలుపుతున్నట్టు బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ సమాచారంతో బీఎన్ విజయ్‌కుమార్ ఊపిరి పీల్చుకున్నప్పటికీ భవిష్యత్ పరిణామాలపై ఆందోళన చెందుతున్నట్టు అనుచరులు చెబుతున్నారు.

 తొలుత  పొత్తులో భాగంగా బీజేపీ నాయకత్వం కొండపి స్థానాన్ని కోరగా, చంద్రబాబు మాత్రం సంతనూతలపాడు లేదా గిద్దలూరు కేటాయిస్తామని చెప్పినట్లు సమాచారం. ఎటూ టీడీపీ గెలవలేదనే ఆలోచనతోనే కొండపి, గిద్దలూరును త్యాగం చేసేందుకు చంద్రబాబు సిద్ధ పడినట్టు చెపుతున్నారు.

 దామచర్ల జనార్దన్ అనుంగు శిష్యుడు బాల వీరాంజనేయ స్వామి కిందటి ఎన్నికల్లో కొండపి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారీ అతడినే బరిలో దించేందుకు నిర్ణయించారు. అయితే, బలరాం తెచ్చిన విజయ్‌కుమార్‌ను సంతనూతలపాడులో ఉండనివ్వకుండా  చంద్రబాబు వద్ద దామచర్ల చక్రం తిప్పారని ప్రత్యర్థివర్గం ఆరోపిస్తుంది. దీంతో కరణం బలరాం ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని బీజేపీని సంతనూతలపాడు నుంచి కొండపికి మార్చినట్లు పార్టీవర్గాల సమాచారం.

 ఆది నుంచి టీడీపీలో సీనియర్‌గా ఉండటం అందర్నీ కలుపుకునిపోవడం కరణం బలరాం బలంగా చెబుతుండగా, జిల్లాపార్టీ అధ్యక్షుడిగా కార్యకర్తలతో మమేకం కాలేకపోవడం పార్టీలో జీతాలిచ్చి సొంత వ్యక్తులను పెట్టుకుని కార్యక్రమాలు చేయించడం దామచర్ల బలహీనతగా వైరివర్గాలు  దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.  ఇద్దరిపై చంద్రబాబుకు ఇప్పటికే ఫిర్యాదులు వెళ్లాయి.

 మార్కాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరులో పిడతల సాయికల్పనకు సీట్లు గల్లంతు కావడంలో కూడా ఈ ఇద్దరి మధ్య ఆధిపత్యపోరే కారణమని పార్టీనేతలు చెబుతున్నారు. తాజాగా, కొండపిలో  తన సన్నిహితుడు బాలవీరాంజనేయ స్వామికి సీటులేకుండా చేయడంలో ప్రత్యర్థి ఎత్తుగడకు దామచర్ల ఎలాంటి పైఎత్తు వేస్తారోనని పార్టీ కేడర్ వేచిచూస్తోంది.

మరిన్ని వార్తలు