ఆహాఏమిరుచి..అనరామైమరచి

16 Jul, 2019 09:23 IST|Sakshi

సాక్షి, కొవ్వూరు (పశ్చిమ గోదావరి) : వర్షాకాలం వచ్చింది.. దాని వెంటే మొక్కజొన్న పొత్తులు వచ్చాయి. ఒక పక్క వర్షం కురుస్తుంటే మరో పక్క వేడి వేడి జొన్నపొత్తులు తింటుంటే ఆ మజానే వేరంటారు మొక్కజొన్న పొత్తుల ప్రియులు. ఏటా జులై నుంచి సెప్టెంబర్‌ వరకూ దొరికే మొక్కజొన్న పొత్తులకు మంచి గిరాకీ ఉంటుంది. రాష్ట్రంలో దొరికే మొక్కజొన్న పొత్తుల కన్నా దొమ్మేరు పొత్తుకు ఓ ప్రత్యేక రుచి ఉంటుంది. ఇక్కడ ఉండే నేల స్వభావంతో ఈ ప్రాంతంలో పండే మొక్కజొన్న పొత్తులు మంచి రుచిని కలిగి ఉంటాయి.

స్థానికులకు ఉపాధి
మొక్కజొన్నపొత్తుల సీజన్‌ పలువురికి ఉపాధిగా మారుతుంది. దొమ్మేరుతో పాటు దూర ప్రాంతాలకు సైతం పొత్తులు ఎగుమతి అవుతుండటంతో స్థానికులకు ఆదాయం సమకూరుతోంది. ఈ సీజన్‌లో ఇక్కడ రోడ్ల పక్కన దుకాణాలు ఏర్పాటు చేసుకుని పొత్తులు అమ్ముతూ జీవనం సాగిస్తారు. ఒక్కో దుకాణంలో వెయ్యి పొత్తుల వరకూ కాల్చి అమ్మి ఆదాయం పొందుతారు. ఈ ప్రాంతంలో దొరికే పొత్తులను హోల్‌సేల్‌గా కొని, దుకాణాల్లో కాల్చి రిటైల్‌గా అమ్ముతుంటారు. ఒక్కో  పొత్తు ప్రస్తుతం రూ. 10 నుంచి రూ. 15 వరకూ సైజును బట్టి  అమ్మకాలు జరుపుతున్నారు. అయితే ప్రస్తుతం ధరలు అధికంగా ఉండడంతో ఈ ధర గిట్టుబాటు కావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు

ఎకరం మొక్కజొన్న చేను రూ.50 వేలు
మొక్కజొన్న సీజన్‌ ప్రారంభం కావడంతో పొత్తులకు మంచి డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం ఎకరం మొక్కజొన్న తోటకు రూ.50 వేల వరకూ వ్యాపారులు చెల్లించి రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇది చాలా మంచి రేటని రైతులు చెబుతున్నారు. అయితే గత ఏడాది తయారవుతున్న మొక్కజొన్న పొత్తును పురుగు ఆశించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దిగుబడి లేక కొనుగోలు చేసిన వ్యాపారులు సైతం నష్టాలను చవిచూశారు. దీంతో సాగు విస్తీర్ణం తగ్గడంతో ధరలు పెరిగాయని చెబుతున్నారు. ఈ ఏడాది దొమ్మేరు, పరిసర గ్రామాల్లో అతి తక్కువ సాగు ఉండడం దీనికి కారణం అని చెబుతున్నారు. ఏది ఏమైనా కేవలం వర్షాకాలంలో దొరికే దొమ్మేరు ప్రాంతంలోని మొక్కజొన్న పొత్తును ఒక్కసారైనా రుచి చూడాలని ఈ ప్రాంతం మీదుగా వెళ్లే ప్రయాణికులు, ప్రజలు భావిస్తుంటారు.

దొమ్మేరు మొక్కజొన్న పొత్తులకు భలే డిమాండ్‌

కొవ్వూరు మండలం దొమ్మేరులో మొక్కజొన్న పొత్తుల దుకాణాలు 

మరిన్ని వార్తలు