మినీ ఎయిర్‌పోర్టుగా ‘దొనకొండ’ పరిశీలన

20 Dec, 2014 02:04 IST|Sakshi
మినీ ఎయిర్‌పోర్టుగా ‘దొనకొండ’ పరిశీలన

దొనకొండ: దొనకొండలోని రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బ్రిటీష్‌వారు నిర్మించిన ఎయిర్‌పోర్టును ఢిల్లీకి చెందిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం శుక్రవారం పరిశీలించింది. నాటి ఎయిర్‌పోర్టు భవనాన్ని, గ్రౌండ్‌ను బృంద సభ్యులు పరిశీలించారు. రాష్ట్రంలో మూడు మినీ ఎయిర్‌పోర్టులు నిర్మించాలని ప్రభుత్వం భావించింది. వాటిలో ఒకటి దొనకొండలో ఏర్పాటు చేసేందుకు పరిశీలన జరిపారు. ఇక్కడి వాతావరణ అనుకూలతను పరికరాల ద్వారా పరిశీలించారు. జిల్లా సర్వేయర్ నరసింహారావు ఎయిర్‌పోర్టు, చుట్టుపక్కల ప్రాంతాలను మ్యాపులో గుర్తించారు.

ముందుగా జిల్లా కోఆప్షన్ షేక్ మగ్బుల్ అహ్మద్, మండల వినియోగదారుల సంఘ కన్వీనర్ షేక్ నవాబు, మరికొంత మంది స్థానికులు దొనకొండలోని పరిస్థితులను, అనుకూలతలను బృందానికి తెలియజేశారు. అనంతరం స్థానిక రైల్వే గెస్ట్‌హౌస్‌లో బృంద సభ్యులు విలేకరులతో మాట్లాడుతూ ఎయిర్‌పోర్టుకు సంబంధించి 136.5 ఎకరాల స్థలం, ఇక్కడి భౌగోళిక పరిస్థితులను పరిశీలించామని, మినీ ఎయిర్‌పోర్టుకు అనుకూలంగా ఉందని వివరించారు. ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు.

బృందంలో ఢిల్లీకి చెందిన ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా జాయింట్ జనరల్ మేనేజర్ నరేందర్ మకీజా, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సుధేష్ శర్మ, ఆర్కిటెక్చర్ మహమ్మద్ వసీం, విజయవాడకు చెందిన ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా డెరైక్టర్ రాజా కిషోర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జేఎస్.గుప్తా, తహశీల్దార్ కేవీ సత్యనారాయణ, ఆర్‌ఐ సుబ్రహ్మణ్యం, సర్వేయర్ అల్లూరయ్య, వీఆర్వోలు ఉన్నారు.

మరిన్ని వార్తలు