సీఎం సహాయ నిధికి ఉద్యోగ సంఘాల విరాళం

27 Mar, 2020 05:21 IST|Sakshi

సీఎంను కలిసి లేఖలు సమర్పించిన నేతలు

సాక్షి నెట్‌వర్క్‌: కోవిడ్‌19 నియంత్రణకు ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక రోజు జీతం విరాళంగా ప్రకటించాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం క్యాంపు కార్యాలయంలో కలిసి ఉద్యోగ సంఘాల నేతలు లేఖలు సమర్పించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి, అదనపు కార్యదర్శి కత్తి రమేష్, ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రెవిన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షులు వై.వి.రావు, రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సోమేశ్వర్రావు తదితరులు ఉన్నారు. ఒకరోజు జీతం విరాళం ద్వారా దాదాపు రూ.100 కోట్లు సమకూరుతాయని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి అన్నారు. కోవిడ్‌ –19 నివారణ కోసం సీఎం తీసుకుంటున్న చర్యలు పటిష్టంగా ఉన్నాయని ప్రశంసించారు.

గ్రంథాలయ సంస్థల ఉద్యోగులు విరాళం   
ముఖ్యమంత్రి సహాయనిధికి రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విరాళాన్ని అందిస్తా మని ఆ సంఘం రాష్ట్ర నాయకులు కోన దేవదాసు, కళ్లేపల్లి మధుసూదనరాజు ప్రకటనలో పేర్కొన్నారు.

విద్యుత్‌ ఉద్యోగుల వితరణ  
కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ విద్యుత్‌ ఉద్యోగులు బాసటగా నిలిచారు. మార్చి నెలలో ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర బాబు ఈ విషయాన్ని గురువారం మీడియాకు వెల్లడించారు. విరాళంగా పోగయ్యే మొత్తం రూ. 20 కోట్ల వరకూ ఉంటుందని ఆయన చెప్పారు.  

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి సీఎం సహాయనిధికి విరాళాల లేఖలను అందజేస్తున్న సచివాలయ ఉద్యోగుల సంఘం, ఏపీ జేఏసీ, రిటైర్డ్‌ ఉద్యోగుల  సంఘాల నేతలు 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా