సీఎం సహాయనిధికి మాత్రమే విరాళాలివ్వండి

16 Oct, 2014 01:23 IST|Sakshi
సీఎం సహాయనిధికి మాత్రమే విరాళాలివ్వండి

 తుపాను బాధితులకు సహాయం చేయదలిస్తే ముఖ్యమంత్రి సహాయనిధికి మాత్రమే దాతలు తమ విరాళాలను అందచేయాలని కలెక్టర్ సూచించారు. విరాళాలను సీఎం సహాయ నిధికి ఆన్‌లైన్ ద్వారా ఎస్‌బీఐ ఖాతా నంబర్ 33913634404 (ఐఎఫ్‌ఎస్ కోడ్ ఎస్‌బీఐ 0002724)కు పంపవచ్చన్నారు. చెక్కు ద్వారా పంపేవారు డిప్యూటీ సెక్రటరీ, రెవెన్యూ శాఖ 4వ ప్లోర్, ఎల్ బ్లాక్, సెక్రటేరియట్, హైదరాబాద్ చిరునామాకు పంపించవచ్చన్నారు. కూరగాయలు, పాలు, తదితర నిత్యావసర సరుకులు అందించదలిస్తే వాటిని జిల్లా యంత్రాంగం ద్వారా పంపవచ్చనని వివరించారు.
 
 ఏలూరు : ఉత్తరాంధ్ర జిల్లాల్లో తుపాను బాధితులకు జిల్లా నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారం మూడో రోజు కూడా ఆహార పొట్లాలు, పాలు, బిస్కెట్లు, ఇతర నిత్యావసర సరుకులను ఆయా ప్రాంతాలకు తరలించారు. వివిధ వర్గాల ప్రజలే కాకుండా జిల్లా యంత్రాంగం కూడా సహాయక చర్యలను వేగవంతం చేసింది. అలాగే బాధితులను ఆదుకునేందుకు పలువురు సీఎం సహాయనిధికి విరివిగా విరాళాలను అందజేస్తుండగా, మరికొందరు నేరుగా ఆహారం తయారుచేసి సొంత వాహనాల్లో బాధిత ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నారు.
 
 రూ.1.75 కోట్ల విలువైన
 ఆహార పదార్థాలు పంపించాం
  విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలలో బాధితులకు అందించేందుకు ఇప్పటివరకు రూ.1.75 కోట్ల విలువైన ఆహార పదార్ధాలను జిల్లా నుంచి పంపినట్లు కలెక్టర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆన్‌లైన్ ద్వారా తుఫాన్ బాధితులకు ఏ మేరకు సహాయం అందుతుందో కలెక్టరు పరిశీలించారు. జిల్లా నుండి 3,62,670 ఆహార పొట్లాలను, కోటి మంచినీటి ప్యాకెట్లను, లక్షా 30,732 బిస్కెట్ ప్యాకెట్లను, 52 మెట్రిక్ టన్నుల కూరగాయలను, 75 క్వింటాళ్ల బియ్యాన్ని, 6 వేల బ్రెడ్ ప్యాకెట్లను, 500 చీరలను, 50 వంటపాత్రలను పంపించామని వివరించారు. అలాగే 14 వాటర్ ట్యాంకులు, 10 హెచ్‌పీ సామర్ధ్యంగల 20 జనరేటర్లను పంపడం జరిగిందన్నారు. విద్యుత్, పంబ్లింగ్ మరమ్మతుల కోసం 316 మంది సిబ్బందిని, పునరావాస కార్యక్రమాల కోసం 370 మందితో కూడిన 10 బృందాలను, 359 మంది శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఇతర పారిశుద్ద్య కార్మికులనుపంపించామన్నారు.  
 
 3 లక్షల విలువైన పాలు తరలింపు
 కలెక్టర్ భాస్కర్ ఆదేశాల మేరకు భీమవరం కాస్మొక్లబ్ అధ్యక్షులు గోకరాజు రామరాజు క్లబ్ తరఫున రూ.3 లక్షల విలువైన 7,500 లీటర్ల పాలను మిల్క్ వ్యాన్ భీమడోలు విశాఖ డైరీ నుంచి పంపే ఏర్పాట్లను చేస్తున్నామని డీపీవో ఎ.నాగరాజువర్మ తెలిపారు. నల్లజర్ల మండలం నుంచి జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు 9వేల లీటర్ల పాలను పంపిణీ కోసం ఏర్పాట్లు చేశారన్నారు.  
 
 రూ.10 లక్షల విరాళం అందజేత
 ఏలూరు : ఏలూరులోని కార్పొరేటర్లు సేవలు చేయడం అభినందనీయమని సీఎం నారాచంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే బడేటి కోటరామారావు(బుజ్జి), నగర మేయర్ షేక్ నూర్జహాన్‌లు కలిసి కార్పొరేటర్ల నుంచి సేకరించిన రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. ఆర్‌ఎన్‌ఆర్ ఫైనాన్స్ అధినేత, 17 డివిజన్ కార్పొరేటర్ దాకారపు రాజేశ్వరరావు రూ.3 లక్షల విరాళాన్ని సీఎంకు అందజేశారు. అనంతరం విశాఖలోని ఎంవీపీ కాలనీ, బీచ్ రోడ్డు, లాసెన్స్‌బే కాలనీల్లో ఎమ్మెల్యే, మేయర్, కో- ఆప్షన్ సభ్యులు ఎస్‌ఎంఆర్ పెదబాబు, డెప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం సహాయక చర్యలు చేపట్టారు. పలు కాలనీల్లో బిస్కెట్లు, మంచినీళ్ల ప్యాకెట్లు,కూరగాయలను పంపిణీ చేశారు.   
 
 కూరగాయలు, పాలు, బియ్యం సేకరించండి
 తాడేపల్లిగూడెం రూరల్ : తుపాను బాధితులను ఆదుకోవాలని సర్పంచ్, ఎంపీటీసీలను జెడ్పీచైర్మన్ ముళ్లపూడి బాపిరాజు కోరారు. తాడేపల్లిగూడెంలో బుధవారం వీరితో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామలలో పాలు, కూరగాయాలు, బియ్యం వంటి విరాళాలు సేకరించాలని సూచించారు. కష్టకాలంలో ఉన్నవారిని మానవతా దృ   క్పథంతో ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరా రు. జెడ్పీటీసీ సభ్యులు కిలపర్తి వెంకట్రావు, ఎంపీపీ పరిమి రవికుమార్, వైస్ ఎంపీపీ కొండపల్లి రాయుడు పాల్గొన్నారు.  
 
 కొవ్వూరు నుంచి 25,350 పులిహోర పొట్లాలు
 కొవ్వూరు : డివిజన్‌లోని  12 మండలాలతోపాటు పురపాలక సంఘాల ద్వారా సేకరించిన బుధవారం 25,350 పులిహోర ప్యాకెట్లను, కూరగాయలను విశాఖపట్నం పంపినట్టు ఆర్డీవో బి.శ్రీనివాసరావు తెలిపారు. పారిశుధ్య నిర్వహణ కోసం డివిజన్ నుంచి 60 టిప్పర్ లారీలను పంపించామని చెప్పారు.
 
 తణుకు నుంచి తరలిన జేసీబీలు
 తణుకు అర్బన్ : విశాఖపట్నంలో సహాయక చర్యలు చేపట్టేం దుకు రవాణా శాఖ ఆధ్వర్యంలో బుధవారం తణుకు నుంచి జేసీబీలను తరలివెళ్లాయి. విశాఖలో రోడ్డు మరమ్మతుల పనుల నిమిత్తం తణుకు నుంచి ఐదు జేసీబీలతోపాటు పాలకొల్లు, ఏలూరు, భీమవరం, జంగారెడ్డిగూడెంల నుంచి మొత్తం 20 జే సీబీలు పంపినట్లు తణుకు ఎంవీఐ పి.సీతాపతిరావు చెప్పారు. జేసీబీలను ప్రత్యేక లారీలలో విశాఖకు తరలించామన్నారు.
 
 విశాఖకు టెక్నికల్  టీమ్
 నరసాపురం అర్బన్ : నరసాపురం డివిజన్ నుంచి ఎలక్ట్రీయన్లు, ఫ్లంబర్లు, తాపీమేస్త్రిలు, వండ్రంగి పని వారలతో కూడిన టెక్నికల్ టీమ్‌ను సహాయక చర్యల కోసం విశాఖపట్నం పంపించారు. బుధవారం నరసాపురంలో వీరు ప్రత్యేక వాహనంలో విశాఖపట్నం తరలివెళ్లారు. ఆర్డీవో డి.పుష్పమణి మాట్లాడుతూ తొలి విడతగా 65 మందిని పంపిస్తున్నామని, మరోసారి 40 మందిని రెండో విడతగా పంపిస్తామన్నారు. తుపాన్ బాధితుల సహాయార్థం భీమవరం రెడ్డి అండ్ రెడ్డి షోరూమ్, వాసవి క్లబ్, ఆర్యవైశ్యసంఘం, కిరాణా మర్చంట్స్ అసోసియేషన్, ఆకివీడు రైస్‌మిల్లర్స్ అసోసియేన్ తదితరుల నుంచి రూ.5.50 లక్షలు విరాళాలు అందాయని చెప్పారు.
 
 తాళ్లపూడి నుంచి రూ.1.75 లక్షల సరుకులు
 తాళ్లపూడి : తాళ్లపూడి మండలం నుంచి రూ.1.75 లక్షలు విలువ చేసే సరుకులను విశాఖపట్నం బుధవారం పంపించారు. అల్లూరి విక్రమాదిత్య 6 వేల పాల ప్యాకెట్లు, 15 వేల వాటర్ ప్యాకెట్లు, 5 వేల బిస్కెట్ ప్యాకెట్లు, రొట్టెల ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు సమకూర్చారు. మండల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నుంచి పాల ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, బిస్కెట్లు, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపించినట్టు అధ్యక్షుడు సింహాద్రి జనార్దనరావు తెలిపారు.
 
 పాలకొల్లు కౌన్సిలర్ల వితరణ
 పాలకొల్లు : పాలకొల్లులో టీడీపీ మునిసిపల్ కౌన్సిలర్లు తుపాను బాధతుల సహాయార్థం రూ.లక్ష విరాళం ప్రకటించారు. బుధవారం చైర్‌పర్సన్ ఛాంబర్ కార్యాలయంలో సమావేశమైన కౌన్సిలర్లు ఈ సహాయాన్ని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ విప్ అంగర రామమోహన్ చేతుల మీదుగా ప్రభుత్వ సహాయ నిధికి పంపించాలని నిర్ణయించారు. మునిసిపల్ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ మహబూబ్ ఆలీఖాన్, షేక్ సిలార్ మైనార్టీ విభాగం నుంచి రూ.10వేలు విరాళం ఇస్తామని ప్రకటించారు.
 
 పాల ఉత్పత్తిదారుల సంఘం రూ.లక్ష విరాళం
 భీమడోలు : ఉత్తరాంధ్ర బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి జిల్లా పాల ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం రూ.లక్ష విరాళాన్ని ప్రకటించింది.  సంఘం జిల్లా అధ్యక్షుడు గంటా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సంఘం నాయకులు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులును బుధవారం భీమడోలులో కలిసి రూ.లక్ష చెక్కును అందజేశారు. విజయ పాలడైయిరీ డీడీ వి.మల్లికార్జునరావు, పాల కేంద్రం మేనేజర్ సూర్యప్రకాశరావు, ఏడీ శశాంక్ పాల్గొన్నారు.
 
 జర్నలిస్టుల సహాయం
 ఏలూరు (ఫైర్‌ేస్టేషన్ సెంటర్) : తుపాను బాధితుల సహాయార్థం ది ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.10వేల విలువైన బిస్కెట్ ప్యాకెట్లను ఎమ్మెల్యే బడేటి బుజ్జికి బుధవారం అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షులు కంది వెంకట ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎ.శివశ్రీ, కార్యదర్శి కొల్లు శ్రీనివాసరావు, కోశాధికారి బి.వెంకట రామారావు, బాలశౌరి, ఎం.విజయకుమారి, బి.భవానీ శంకర్, ఎ.రవికుమార్, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
 ఏలూరు నుంచి తరలిన సామగ్రి
 
 ఏలూరు రూరల్ : శ్రీకాకుళంలో తుపాను బాధితులకు బుధవారం పలువురు దాతలు అందించిన 13 వేల బిస్కెట్ ప్యాకెట్లు, ఏలూరు గంగానమ్మ ఆలయం కమిటీ అందించిన 500 చీరలు, వెయ్యి రొట్టెలు, 50 సెట్ల వంటసామగ్రి, 1,800 దుప్పట్లను వ్యాన్‌లోకి తరలించినట్టు ఆర్డీవో నంబూరు తేజ్‌భరత్ చెప్పారు. అలాగే సాయంత్రం చందనా బ్రదర్స్ యాజమాన్యం పది వేల మంచినీటి ప్యాకెట్లు, 10 వేల బిస్కెట్ ప్యాకెట్లు అందించిందన్నారు. ఏర్పాట్లను తహసిల్దార్ జీవీ సుబ్బారావు, డీటీ నరసింహమూర్తి పర్యవేక్షించారు.
 

>
మరిన్ని వార్తలు