లీటరు పాల ధర రూ.3 నుంచి 5వేలు!

29 Nov, 2014 11:03 IST|Sakshi
లీటరు పాల ధర రూ.3 నుంచి 5వేలు!

కొవ్వూరు : 'గంగి గోవు పాలు గరిటెడైనను చాలు.. కడవడైననేమి ఖరము పాలు' అన్నారు యోగి వేమన. అయితే  ఇప్పుడు గాడిద పాలు గుక్కెడైన చాలు అనే పరిస్థితి ఏర్పడింది. ఉగ్గు గిన్నుడు (10 మిల్లీ లీటర్లు) గాడిద పాలు రూ.30 నుంచి రూ.50 ధర పలకడం చూస్తే ఆ మాటలు తారుమారు అయ్యాయని అనుకోక తప్పదు. ఈ లెక్కన లీటరు గాడిద పాలు రూ.3 వేలు నుంచి రూ.5 వేలకు విక్రయిస్తున్నారు.

గాడిద పాలు తాగితే రోగాలు తొలగిపోతాయనే నమ్మకం ప్రబలంగా ఉండటంతో వాటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. అరుదుగా లభ్యమయ్యే ఈ పాటను అమ్మేవారు కనిపిస్తే అమాంతం వెళ్లి కొంటున్న వారు ఎక్కువమందే ఉన్నారు. గాడిద పాలు తాగితే ఆస్తమా, ఉబ్బసం, నెమ్ము, ఆయాసం, దగ్గు వంటి రోగాలు రావన్న నమ్మకంతో వీటిని కొనేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. గాడిద పాలతో ఉపయోగముందో తెలియదు గాని జనం మాత్రం ఎగబడి పాలను కొంటున్నారు.

ఒకప్పుడు ఏ పనీ చేయకుండా తిరిగేవారిని..ఏం పనీ చేయకపోతే...గాడిదలను కాస్తావా? అని వెటకారంగా అనేవారు. ఇప్పుడు గాడిదను కాసే...డబ్బు సంపాదిస్తున్నారు. సంచార కుటుంబానికి చెందిన పి. నాగేంద్ర అనే వ్యక్తి తాను పెంచుతున్న గాడిదతో ఊరూరా తిరుగుతూ దాని పాలు పిండి విక్రయిస్తున్నాడు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో గాడిద పాలను విక్రయించాడు. ఉగ్గు గిన్నెడు పాలను రూ.30 నుంచి రూ.50కి విక్రయిస్తున్నానని, రోజుకు ఇలా రూ.300 నుంచి రూ.400 సంపాదిస్తున్నట్లు అతడు చెప్పడం విశేషం.

మరిన్ని వార్తలు