చెట్టే కదా అని నరికేస్తే..రౌడీషీట్

5 Aug, 2014 03:02 IST|Sakshi
చెట్టే కదా అని నరికేస్తే..రౌడీషీట్

 గుంతకల్లు టౌన్ :  ప్రత్యర్థుల తోటల్లో చెట్లు నరికే విష సంస్కృతిని విడనాడకుంటే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని గుంతకల్లు డీఎస్పీ సీహెచ్ రవికుమార్ స్పష్టం చేశారు. ఆదివారం గుంతకల్లు మండలం పులగుట్టపల్లి పెద్దతండాలో వైఎస్‌ఆర్‌సీపీ ఎస్టీ సెల్ మండల కన్వీనర్ గోవింద్‌నాయక్ పొలంలో 150 మామిడి మొక్కలను అదే గ్రామానికి చెందిన వారు నరికి వేసిన విషయం తెలిసిందే.

ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ రాజశేఖర్‌బాబు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను మీడియా ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పులగుట్టపల్లి
 
 పెద్దతండాకు చెందిన మనేనాయక్ తండ్రి కమెలేనాయక్‌పై 2013లో ఓ కేసు నమోదైంది. ఈ కేసు మరో 15 రోజుల్లో తుది విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో తన తండ్రికి శిక్ష పడకుండా కాపాడేందుకు ఫిర్యాదురాలితో రాజీ చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ నేత గోవింద్‌నాయక్‌ని కోరాడు. తాను చెప్పినా వారు వినే పరిస్థితిలో లేరని గోవింద్‌నాయక్ చెప్పడంతో మనేనాయక్ కక్ష పెంచుకున్నాడు. రాజునాయక్ అనే మరో నిందితుడు కూడా గత ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేశాడు. ఈ గ్రామంలో గోవిందనాయక్ వల్ల వైఎస్‌ఆర్‌సీపీ బలోపేతం కావడాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఇద్దరూ కలిసి గోవింద్‌నాయక్‌ను ఆర్థికంగా దెబ్బ తీయాలనుకున్నారు.
 
 ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన రాత్రి పొలంలోకి వెళ్లి 150 మామిడి మొక్కలను నరికివేశారు. సోమవారం నిందితులు పులగుట్టపల్లి బస్టాప్ వద్ద వుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ సుబ్రమణ్యం, ఎస్‌ఐ రామయ్య, ఏఎస్‌ఐ శ్రీరాములు పాల్గొన్నారు.

నిందితుల ఫొటోలతో ఫ్లెక్సీలు  
జిల్లాలో రైతులు సాగు చేసిన పండ్ల తోటలను నరికివేసి ఆర్థికంగా నష్టపరిచే నిందితులపై రౌడీషీట్‌లను ఓపెన్ చేయాలని ఎస్పీ ఆదేశించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుల ఫొటోలతో కరపత్రాలు, ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్లు వేయించే వినూత్న ఒరవడికి గుంతకల్లు నుండే శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు. ఇకపై ప్రతి రోజూ అన్ని పల్లెల్లో రాత్రి వేళ ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తామన్నారు. పండ్ల తోటల పెంపకందార్లకు ఎవరినుండైనా హాని ఉన్నట్లయితే వారి వివరాలను సేకరించి, ఇలాంటి ఘటనలు జరగకుండా ఇరువురికీకౌన్సెలింగ్ నిర్వహించి వారి మధ్య స్నేహసంబధాల్ని మెరుగు పరిచేందుకు చర్యలు చేపడతామన్నారు.
 
 గ్రామాల్లో వర్గ, రాజకీయ కక్షలను ఎవరైనా ప్రోత్సహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అనంతరం పులగుట్టపల్లిపెద్దతాండాలో మామిడి మొక్కలను నరికేసిన మనేనాయక్, రాజునాయక్‌ల ఫోటోలతో వేయించిన కరపత్రాలు, ఫ్లెక్సీలను డీయస్పీ రవికుమార్, రూరల్ సీఐ సుబ్రమణ్యం ఆవిష్కరించారు. ఈ ఫ్లెక్సీలను గుంతకల్లు పట్టణంతో పాటు అన్ని గ్రామాల్లో వేయించి, కరపత్రాల ద్వారా ఇలాంటి ఘటనలు జరగకుండా హెచ్చరికలు జారీ చేయనున్నామని వారు తెలిపారు.   
 
 నిందితులకు ఎస్పీ కౌన్సెలింగ్  
 గుత్తి : మామిడి మొక్కలు నరికివేత ఘటనలో నిందితులకు ఎస్పీ రాజశేఖర్‌బాబు కౌన్సెలింగ్ ఇచ్చారు. సోమవారం గుత్తి పోలీస్‌స్టేషన్‌కు ఇద్దరు నిందితులను తరలించారు. అనంతరం అక్కడకు చేరుకున్న ఎస్పీ తనదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. కార్యక్రమంలో సీఐ మోహన్, ఎస్‌ఐలు కృష్ణారెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు