అనుబంధ పరిశ్రమలకు ఇవ్వం

8 Sep, 2015 01:13 IST|Sakshi
అనుబంధ పరిశ్రమలకు ఇవ్వం

పోర్టుకు ఇస్తాం
 

విదేశీ సంస్థలకు తమ భూములు అప్పగించేది లేదంటూ రైతుల నినాదాలు
భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసేవరకు పోరుబాట
ధర్నాలో రైతులు, పోలీసుల మధ్య   తోపులాట

 
మచిలీపట్నం : ‘రెక్కలు ముక్కలు చేసుకుని ఒక్కో రూపాయి కూడబెట్టి, రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించుకున్న మా భూములను స్వాధీనం చేసుకునేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రాణాలు పోయినా ఈ ప్రయతాన్ని అడ్డుకుంటాం’ అంటూ రైతులు ఎలుగెత్తి చాటారు. బందరు పోర్టుకు కాకుండా అనుబంధ పరిశ్రమలకు బందరు, పెడన మండలాల్లోని 24 గ్రామాల్లో 25 వేల ఎకరాలను సేకరించేందుకు విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ రైతులు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. మూడు గంటలపాటు ఈ ధర్నా కొనసాగింది. ప్రాణాలైనా అర్పిస్తాం గాని భూములు ప్రభుత్వానికి అప్పగించబోమంటూ రైతులు చేసిన నినాదాలతో కలెక్టరేట్ మార్మోగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, ఇతర ప్రజాసంఘాలు రైతుల ధర్నాకు మద్దతు పలికాయి. 24 గ్రామాల నుంచి వేలాదిగా రైతులు తరలిరావటంతో కలెక్టరేట్ ఎదుట రోడ్డు కిక్కిరిసిపోయింది. మండే ఎండను సైతం లెక్క చేయకుండా రైతులు మూడు గంటల పాటు ధర్నా నిర్వహించారు.

 అడ్డుకునేందుకు సిద్ధం...
 ధర్నాను ఉద్దేశించి వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని మాట్లాడుతూ తాతల, తండ్రుల నాటి నుంచి రైతులు సంపాదించుకున్న భూమిని టీడీపీ ప్రభుత్వం పరిశ్రమల స్థాపన పేరుతో విదేశీ సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. స్థానికంగా ఉన్న మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావులు ముఖ్యమంత్రి చెప్పినట్లుగా నడుచుకుని రైతులకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. భూమి సర్వే పనులు ఒకటి, రెండు రోజుల్లో ప్రారంభిస్తారని, ప్రతి గ్రామంలోనూ రైతులు అధికారులను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

 పోర్టుకు వ్యతిరేకం కాదు...
 పోర్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, అనుబంధ పరిశ్రమల పేరుతో 25 వేల ఎకరాల సేకరణనే వ్యతిరేకిస్తున్నామని పేర్ని నాని చెప్పారు. 25 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. కలెక్టర్ బాబు.ఎ ముఖ్యమంత్రికి చెంచాలా వ్యవహరిస్తున్నారని, రైతులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నారని తెలుసుకుని ఇక్కడకు రాకుండా పారిపోయారని ఆయన విమర్శించారు. రైతులు ఒక్క అడుగు వేస్తేనే కలెక్టర్ పారిపోయారని, ఇది రైతుల తొలి విజయమని అన్నారు. మరో రెండు అడుగులు వేస్తే ఎంపీ, మంత్రి కూడా పారిపోతారన్నారు.

 రైతుల తరఫున పోరాటం
 సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ పోర్టు నిర్మాణం కోసం ఎన్నాళ్లుగానో పోరాటం జరుగుతోందని, ఇందుకోసం ఐదు వేల ఎకరాల భూమిని ఇచ్చేందుకు కూడా రైతులు సిద్ధంగా ఉన్నారని వివరించారు. పోర్టు నిర్మించకుండా, ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తారో చెప్పకుండా పరిశ్రమల స్థాపన పేరుతో 25 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి తీసుకుని విదేశీ సంస్థలకు అప్పగించేందుకు టీడీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ సింగపూర్, జపాన్ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు రైతుల భూములను కట్టబెట్టేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
 వేల ఎకరాల భూములను సేకరించి ఏ సంస్థకు అప్పగిస్తారని ప్రశ్నించారు. ఈ నెల 13న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మచిలీపట్నంలో పర్యటిస్తారని చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు మాట్లాడుతూ రైతుల నుంచి భూములను తీసుకుని వాటిని తాకట్టుపెట్టి కోట్లాది రూపాయల వ్యాపారం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు.

 అమరావతి రైతులకు ఇప్పటికీ ఇవ్వలేదు
 సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్ రఘు మాట్లాడుతూ అమరావతిలో భూమిని కోల్పోయిన రైతులకు ఇంతవరకు కేటాయింపు చేయలేదన్నారు. వారికి కేటాయించిన భూమి ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఉందన్నారు. మచిలీపట్నంలోనూ ఇదే పరిస్థితిని ప్రభుత్వం పునరావృతం చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు భూదాహం పెరిగిపోయిందని, రైతులను బెదిరిస్తున్నారన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ కంచికచర్లలో ఓ స్వామీజీకి వందలాది ఎకరాలను ప్రభుత్వం ఇచ్చేందుకు ప్రయత్నిస్తే అక్కడి రైతులు తిరగబడ్డారన్నారు. 30 రోజుల పాటు ఉద్యమం జరిగిందని, దీంతో ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. సీపీఎం పట్టణ కార్యదర్శి కొడాలి శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు వై.కేశవరావు, ఎం.వాకాలరావు తదితరులు పాల్గొన్నారు.

 తోపులాట.. ఉద్రిక్తత..
 కలెక్టరేట్ వద్ద రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ధర్నా కోసం ఆటోలో జనరేటర్, సౌండ్ బాక్సులను తీసుకురాగా ఎస్సై జనరేటర్ హ్యాండిల్‌ను తనతో తీసుకువెళ్లారు. రైతులు ఎంత బతిమాలినా పోలీసులు స్పందించకపోవటంతో వేలాదిమంది కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు పోలీసులు దిగి వచ్చి జనరేటర్ హ్యాండిల్ ఇవ్వటంతో పరిస్థితి సద్దుమణిగింది. రైతుల ధర్నాను అదుపు చేసేందుకు రోప్ పార్టీ, భాష్పవాయువు గోళాలు ఉపయోగించే తుపాకులు, రైతులపై నీటిని చిమ్మేందుకు ఫైర్ ఇంజన్, ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేయటం గమనార్హం.
 

మరిన్ని వార్తలు