పాము కరిస్తే పూజలు చేయొద్దు

1 Sep, 2018 12:31 IST|Sakshi
అవనిగడ్డ వైద్యశాలలో పాముకాటు బాధితులను పరామర్శిస్తున్న అనూరాధ, బుద్ధప్రసాద్‌

వీలైనంత త్వరగా వైద్యం చేయించుకోవాలి

మంత్రాలు, నాటువైద్యం జోలికెళ్ళొద్దు

జడ్పీ ౖచైర్‌పర్సన్‌ అనూరాధ

కృష్ణాజిల్లా, అవనిగడ్డ: పాముకాటు వేసినపుడు మూఢ నమ్మకాలకు పోయి మంత్రాలు, నాటువైద్యం, పూజలు చేస్తూ కూర్చోకుండా వీలైనంత త్వరగా వైద్యశాలకు వెళ్ళి చికిత్స తీసుకోవాలని జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ పేర్కొన్నారు. శుక్రవారం స్ధానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న పాముకాటు బాధితులను అనూరాధ, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ పరామర్శించారు.  పాముకాటుకు గురై చికి త్స తీసుకుంటున్న రోగులను పరామర్శించారు. ఎక్కడికి వెళితే పాము కరచింది, ఎంత సమయంలో వైద్యశాలకు వచ్చారు, చికిత్స ఎలా అందుతుందని ప్రశ్నించారు. పాముకాటుకు గురైన వెంటనే సమీపంలోని వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందడం ద్వారా ప్రాణాపాయం లేకుండా చూసుకోవచ్చన్నారు. మోపిదేవిలో నిర్వహించిన సర్పశాంతి హోమం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఛైర్‌పర్సన్‌ బదులిస్తూ పాముకాటుకు గురైనపుడు భయపడుతూ ఉండటం వల్ల విషప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఈ భయాలను తొలగించేందుకు, మనో ధైర్యం ఇచ్చేందుకు ఈ హోమం దోహద పడుతుందని పేర్కొన్నారు.

అవసరమైతే స్నేక్‌ స్టిక్స్‌ సరఫరా...
వరదలు, పంటకాలువలో కొత్తనీరు రావడం, వర్షాలు ఎక్కువగా కురవడం, ఎలుకలు పెరగడం వల్ల పాముల బెడద ఎక్కువైందని ఛైర్‌పర్సన్‌ అనూరాధ చెప్పారు. వీటి బారి నుంచి రైతులు, కూలీలను కాపాడేందుకు జిల్లా పరిషత్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని 11 గ్రామాల్లో హెక్టార్‌కి 40 కిలోల గుళికలను ఉచితంగా అందిస్తున్నామన్నారు.

వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దృష్టికి పాముకాట్ల విషయం తీసుకెళ్ళినట్టు చెప్పారు. అవసరమైతే పాములు దగ్గరకు రాకుండా ఉండే శబ్ధతరంగాల స్టిక్స్‌ను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలలు, పీహెచ్‌సీల్లో పాము విషం విరుగుడు (యాంటీ స్నేక్‌ వీనం ఇంజక్షన్లు) అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ బీవీ కనకదుర్గ, జడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు, వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కృష్ణదొర, వైద్యశాల అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ మత్తి శ్రీనివాసరావు, వైద్యులు టి.నాగలక్ష్మీ, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్‌ (రాజా), ఎంపీటీసీ గాజుల మురళీకృష్ణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు