పేరుకు ముందు పద్మశ్రీ వాడొద్దు

12 Apr, 2014 03:36 IST|Sakshi
పేరుకు ముందు పద్మశ్రీ వాడొద్దు

* మోహన్‌బాబుకు సుప్రీం కోర్టు ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ఇచ్చే పద్మ పురస్కారాలను పేరుకు ముందు వాడరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబుకు కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని భారత రాష్ట్రపతికి  తిరిగి అప్పగించేలా కేంద్ర హోం శాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గత ఫిబ్రవరిలో తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆదేశాల నుంచి ఉపశమనం కోరుతూ మోహన్‌బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

శుక్రవారం జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ‘పద్మశ్రీని పేరుకు ముందు వాడడం తప్పు కదా? ఎందుకు వాడుతున్నారు? ఎక్కడా పేరుకు ముందు వాడకూడదు. చివరికి ఇంటి ముందు నేమ్ ప్లేట్‌పై కూడా వాడకూడదు’ అని జస్టిస్ దత్తు వ్యాఖ్యానించారు. పద్మశ్రీని ఇకపై పేరుకు ముందు వాడబోమని, సినిమాల్లో వాడి ఉంటే తొలగిస్తామని ప్రమాణపత్రం దాఖలు చేయాలంటూ ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు విచారణను తిరిగి ఏప్రిల్ 17కు వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.

మరిన్ని వార్తలు