కాంగ్రెస్, కిరణ్ పార్టీలకు ఓటు వేయవద్దు

11 Apr, 2014 05:04 IST|Sakshi

  తెలగ, బలిజ, కాపు ఐక్యకార్యాచరణ వేదిక రాష్ర్ట కన్వీనర్  రామ్మోహనరావు

ఇచ్ఛాపురం,న్యూస్‌లైన్: రిజర్వేషన్ల హామీని మరిచిన కాంగ్రెస్, కిరణ్ పార్టీలకు ఎట్టిపరిస్థితులలోనూ ఓటు వేయవద్దని తెలగ, బలిజ, కాపు ఐక్య కార్యాచరణ వేదిక రాష్ర్ట కన్వీనర్ దాసరి రామ్మోహనరావు పిలుపునిచ్చారు.

గురువారం ఇచ్ఛాపురంలో పర్యటించిన ఆయన సంఘ ముఖ్యులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలగ, ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని 2004 ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న కాంగ్‌స్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలగ, బలిజలను విస్మరించిందని విమర్శించారు.
 
 రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రస్థాయిలో పోరాటాలు చేసినా ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్‌కుమార్ రెడ్డి పట్టించుకోకుండా ఫైల్‌ను తోక్కిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రలో తెలగ, బలిజ, కాపులు 22 శాతం జనాభా ఉంటారని, ఈ ప్రాంతంలో ఏ రాజకీయ పార్టీ గెలవాలన్నా ఈ కులాల ఓట్లు కీలకమన్నారు.తెలగ కులస్తులందరూ తమ ఓట్లు చీల్చుకోకుండా, అమ్ముకోకుండా ఐకమత్యంగా, బాధ్యత యుతవంగా వ్యవహరించాలన్నారు.
 
 వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయితే జనాభా దామాషా ప్రకారం అత్యధిక స్థానాలు ఇవ్వడంతోపాటు అధికారంలోకి వచ్చిన  ఏడాదిలోనే బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని నిజాయితీగా మేనిఫెస్టోలో హామీ ఇస్తుందో తమ మద్దతు ఉంటుందన్నారు. సమావేశంలో స్థానిక తెలగ కుల పెద్దలు బల్లా రామారావు, వల్లూరి జానకి రామారావు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు