ఇంటి రుణం చెల్లించనక్కర్లేదు.. 

10 Apr, 2019 08:29 IST|Sakshi

ఫ్లాట్ల పేరిట అడుగుకు రూ.2 వేల చొప్పున అమ్మే కార్యక్రమాన్ని చంద్రబాబు చేస్తున్నారు. ఈ ప్లాట్లకు సిమెంట్‌ సబ్సిడీగా ఇస్తున్నారు, స్థలం ఉచితంగా ఇస్తున్నారన్నారు. ఈ ప్లాట్లకు లిప్టు,   గ్రానైట్‌ ఫ్లోరింగ్‌ లేదని, ఇలాంటి ప్లాట్లను కట్టడానికి ఎంతవుతుందని బిల్డర్‌లను అడిగితే అడుగుకు రూ.వెయ్యి దాటదని చెబుతున్నారు. ఇలాంటి ప్లాట్లకు అడుగుకు రూ.2 వేల చొప్పున ప్రతి పేదవాడి వద్ద నుంచి దారుణంగా దోచేస్తున్నారు. రూ.6 లక్షల ఫ్లాట్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.1.50 లక్షల చొప్పున ఇస్తాయట. మరో రూ.3 లక్షలు పేదవాడికి అప్పుగా రాసుకుని నెలానెల రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు కడుతూ పోవాలట. లంచాలు తీసుకునేదేమో చంద్రబాబు, ఆ లంచాలకు పేదవాడు ఈ అప్పు అంతా కట్టాలట. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే ఆ ఫ్లాట్లపై ఉన్న మొత్తం రుణాన్ని మాఫీ చేస్తామని వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. 


సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఇళ్ల రుణం మాఫీ చేస్తామని వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడైతే హామీ ఇచ్చారో.. నిరుపేదలు సొంతిళ్ల కోసం అధికారులకు దరఖాస్తులు ఇచ్చారు. అయితే టీడీపీ ప్రభుత్వం అందరికీ ఇళ్లు.. అంటూ కొందరికే ఇచ్చింది. అవి కూడా పూర్తి స్థాయిలో నిర్మించలేదు. నిర్మించిన వాటికి లబ్ధిదారులపై రూ.768.36 కోట్ల రుణభారం మోపింది. పేదరికంలో ఉన్న నిరుపేదలు రూ.3 లక్షల రుణం తీర్చాలంటే తలకు మించిన భారమే. ఈ నేపథ్యంలో, వారందరికీ నేనున్నానంటూ ఈ రూ.3 లక్షల రుణాన్ని మాఫీ చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. ఈ లెక్కన జిల్లాలో పేదలపై ఉన్న 768. 36 కోట్ల భారం తీరనుంది. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లు వారి సొంతమవుతాయి. 


జిల్లాకు 26,802 ప్లాట్లు మంజూరు  
అందరికీ ఇళ్ల పథకం రెండు విడతల్లో జిల్లాకు 26,802 ఫ్లాట్లు మంజూరయ్యాయి. స్థల సమస్య, లబ్ధిదారులు ముందుకు రాకపోవడం తదితర కారణాలతో 22,585 ప్లాట్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కాకినాడ కార్పొరేషన్‌కు 4,608 ఫ్లాట్లు, రాజమహేంద్రవరానికి 7,876, పెద్దాపురం మున్సిపాల్టీకి 3,396, సామర్లకోటకు 1,048, రామచంద్రపురానికి 1,088, మండపేటకు 6,276, పిఠాపురానికి 874, అమలాపురానికి 1,636 ఫ్లాట్లు మంజూరయ్యాయి. 


పట్టించుకోని ప్రభుత్వం 
అర్హులకు మూడు సెంట్ల స్థలంలో రూ.1.5 లక్షలతో పక్కా ఇంటిని నిర్మిస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు తొలి మూడేళ్లు ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదు. ప్రతిపక్షం నిరసనలు, ప్రజావ్యతిరేకతతో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పట్టణ ప్రాంత పేదల కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేసే ప్రధాన మంత్రి ఆవాజ్‌ యోజన (పీఎంఏవై) పథకాన్ని ఎన్‌టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌గా మార్చేశారు. స్థలం కొని, సకల సదుపాయాలతో నిర్మించే ప్రైవేటు అపార్ట్‌మెంట్లలోని ఫాట్ల ధర చదరపు అడుగు రూ.1,200 వరకు ఉంటే.. ప్రభుత్వం సేకరించిన స్థలంలో షీర్‌ వాల్‌ టెక్నాలజీ, అరకొర వసతులతో నిర్మించిన ఈ ప్లాటు ధరను చదరపు అడుగుకు రూ.2 వేలుగా నిర్ణయించారు. 


కేటగిరీల వారీగా రుణ భారమిది  
     ‘మొదటి కేటగిరీలో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక బెడ్‌రూం ఫ్లాటు ఖరీదు రూ.5.77 లక్షలు. ఇందులో లబ్ధిదారుని వాటా రూ. 500, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రూ.3 లక్షలు పోగా బ్యాంకు రుణం రూ. 2.76 లక్షలు. 
     ‘రెండో కేటగిరీలో 365 చదరపు అడుగుల్లో సింగిల్‌ బెడ్‌ రూం ఫ్లాటు ఖరీదు రూ.6.9 లక్షలు. ఇందులో లబ్ధిదారుని వాటా రూ. 50 వేలు, బ్యాంకు రుణం రూ.3.4 లక్షలు. 
     ‘మూడో కేటగిరీలో 430 చదరపు అడుగుల్లో డబుల్‌ బెడ్‌రూం ఫ్లాటు ఖరీదు రూ.7.93 లక్షలు. లబ్ధిదారుని వాటా రూ.లక్ష, బ్యాంకు రుణం రూ.3.93 లక్షలు.  
లబ్ధిదారులపై రూ.768.36 కోట్ల భారం  
ఈ లెక్కన నిర్మాణం చేపట్టిన 22,585 ఇళ్లకు లబ్ధిదారులపై రూ. 768.36 కోట్ల రుణ భారం పడింది. కేటగిరీ–1కి 9,288 మందిపై రూ. 256.35 కోట్లు, కేటగిరీ–2కు 1,993 మందిపై రూ.67.76 కోట్లు, కేటిగిరీ–3కు 11,304 మందిపై రూ.444.25 కోట్ల రుణంగా మోపినట్టు అయింది. 

వసూళ్లకు తెగబడ్డ టీడీపీ నేతలు 
రూ. 50వేల నుంచి లక్ష వరకు వసూలు  అధికారం లోకి వస్తే లబ్దిదారులు కట్ట వలసిన రూ.మూడు లక్షల రుణం రద్దు చేస్తానని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో పోటీ పెరిగింది. దీన్ని కూడా టీడీపీ నేతలు క్యాష్‌ చేసుకున్నారు. ఇళ్ల కోసం దరఖాస్తులు ఎక్కువగా వస్తుండటంతో ముడుపులిచ్చినోళ్లకే టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన పరిస్థితి నెలకుంది. ఎమ్మెల్యేల దగ్గరి నుంచి కార్పొరేటర్‌/కౌన్సిలర్ల వరకు సొమ్ము చేసుకున్నారు. ఒక్కో లబ్ధిదారుని నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్టు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.  


జగన్‌ అధికారంలోకి వస్తే రుణం తీర్చనక్కర్లేదు 
ప్రభుత్వం ఇళ్లు ఇచ్చిందని సంతోషపడాలో రూ.3 లక్షల రుణ భారం మోపిందని బాధ పడాలో తెలియని స్థితిలో లబ్ధిదారులు ఉన్నారు. వారికి ఇప్పుడు జగన్‌ ఆపద్బాంధవుడయ్యారు. వారిపై ఉన్న రూ.3 లక్షలకు పైగా ఉన్న రుణాన్ని మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు.  


కొత్తగా 50 వేల దరఖాస్తులు 
ఇళ్ల రుణమంతా మాఫీ చేస్తామని జగన్‌ ప్రకటించిన రోజు నుంచి పక్కా ఇళ్ల కోసం నిరుపేదలు ఎగబడ్డారు. రుణం లేని ఇల్లు వస్తుందన్న ఆశతో దరఖాస్తు చేశారు. కొత్తగా జిల్లాలో 50 వేల మందికిపైగా దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. అయితే వీరికి ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయలేదు. మళ్లీ అధికారంలోకి వస్తే చేస్తామంటూ చెప్పుకొచ్చింది. 

మరిన్ని వార్తలు