కంటైన్మెంట్‌ జోన్లలో కొనసాగుతున్న ఆంక్షలు..

10 Apr, 2020 19:45 IST|Sakshi

కంటైన్మెంట్ జోన్లలో నిత్యావసరాలు డోర్ డెలివరీ

సాక్షి, విశాఖపట్నం: కరోనాను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు విశాఖ జిల్లాలో గుర్తించిన ఏడు కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. అక్కయ్యపాలెం, తాడిచెట్లపాలెం, రైల్వే న్యూ కాలనీ, దొండపర్తి తదితర ప్రాంతాలలో అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టారు. కంటైన్మెంట్ జోన్ లో నిత్యావసర సరుకులు డోర్ డెలివరీ చేసేందుకు 19 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో ఉన్న 19 సచివాలయాల సెక్రటరీలు, సుమారు 250 మంది వాలంటీర్లను ప్రత్యేక బృందాలుగా నియమించారు.

ప్రతీ బృందానికి ఇన్‌చార్జి గా సిఐ వ్యవహరించనున్నారు. ప్రతీ టీంలో 15 నుంచి 20 మంది వాలంటీర్లు ఉంటారు. కంటైన్మెంట్ జోన్లలో 19 బృందాలకు ద్వారా ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి అధికారులు నిర్ణయించారు. కంటైన్మెంట్ జోన్లలో ప్రజలు బయటకి రావొద్దని.. ఇంటికే సరుకులు అందిస్తామని ఎస్పీ రవికుమార్‌ విజ్ఞప్తి చేశారు.

క్వారంటైన్ కేంద్రాల్లో 136 మంది..
విశాఖ జిల్లాలో వివిధ క్వారంటైన్ కేంద్రాలలో 136 మంది ఉన్నారని కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడించారు. భీమిలి లో ఒకరు, యలమంచిలిలో 34 మంది, అరకులో 10, విశాఖపట్నం రైల్వే ఆసుపత్రిలో 44, గాజువాకలో 23, పాడేరులో 24 మంది ఉన్నారని చెప్పారు. జిల్లాలో 96 కేంద్రాలలో 4,623 క్వారంటైన్ పడకలు అందుబాటులో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

కరోనా కంట్రోల్‌ రూమ్‌కు 19 ఫోన్‌ కాల్స్‌..
కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కరోనా కంట్రోల్ రూమ్ కు శుక్రవారం 19 ఫోన్ కాల్స్ వచ్చాయని డిసివో ఎన్.డి. మిల్టన్ తెలిపారు.  కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయని ఆసుపత్రికి వెళ్లేందుకు అంబులెన్సు కావాలని కొంతమంది ఫోన్ చేయగా ఫీల్డ్ సర్వైలెన్స్ బృందానికి తెలియజేసి తగిన చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు కరోనాకు సంబంధించి 825 ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు.

మరిన్ని వార్తలు