అమ్మ కోసం....

23 Nov, 2018 07:10 IST|Sakshi
వసతి గృహంలో గర్భిణులు

ఎత్తైన కొండలపై ఉన్న గిరిజన గర్భిణుల సుఖ ప్రసవం కోసం ప్రత్యేక చర్యలు

మాతా,శిశు మరణాలు లేకుండా చేయడమే లక్ష్యం

గర్భిణుల కోసం ప్రత్యేక వసతిగృహం

విజయనగరం , సాలూరు: ఎత్తైన కొండలపై జీవనం.. కఠినమైన ఆచార వ్యవహారాలు... కట్టుబాట్లు.. నడుమ జీవిస్తుండడం గిరిజనుల ప్రత్యేకత. వారుండే గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం కూడా లేకపోవడంతో సాధారణ జీవనం సైతం దుర్భరమే. అదే గర్భం దాల్చిన మహిళలకైతే నరకప్రాయమే. పౌష్టికాహార లోపం.. రక్తహీనత.. వంటి కారణాలతో ఇళ్ల వద్దే ప్రసవిస్తున్న ఎందరో గర్భిణులు ప్రతిఏటా మృతువాత పడుతున్నారు. అలాగే వైద్యం అందక చిన్నారులు సైతం పురిటిలోనే కన్నుమూస్తున్నారు. పురిటినొప్పులు రాగానే డోలీల సహాయంతో మైదాన ప్రాంతాల్లోని ఆస్పత్రులకు గర్భిణులను తీసుకురావాల్సిన దుస్థితులు  నెలకొన్నాయి. ఈ ఏడాది ఇదేవిధంగా డోలీల సాయంతో గర్భిణులను కొండల నుంచి కిందకు దిస్తుండగా గర్భిణులు మృతువాత పడ్డారు. ఈ విషయాలు పత్రికల్లో రావడంతో మానవహక్కుల కమిషన్‌ సైతం ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. దీంతో పరిస్థితి మార్చాలన్న ఆలోచన నుంచే గిరిశిఖర గ్రామాల గర్భిణులకు ప్రత్యేక వసతిగృహం పుట్టుకొచ్చింది. ఈ ఏడాది అక్టోబరు 17న సాలూరు పట్టణంలోని గుమడాం రోడ్డులో ఉన్న యువజన శిక్షణ కేంద్రంలో వసతిగృహాన్ని ఐటీడీఏ పీఓ లక్ష్మీశా ఆదేశాల మేరకు తెరిచారు. సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లోనే అత్యధిక మంది గిరిజనులు వైద్యం కోసం డోలీలతో కొండలు దిగుతున్న కారణంగా పైలెట్‌ ప్రాజెక్ట్‌గా మూడు మండలాల ఏజన్సీ ప్రాంత గిరిజన గర్భిణుల కోసం వసతి గృహాన్ని ప్రారంభించారు.

ఎన్నో అడ్డంకులు..
ఇదిలా ఉంటే ప్రత్యేక వసతిగృహం విధానం వల్ల వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా గిరిజనులు ఇంటివద్దే ప్రసవం జరుపుకునేందుకు ఇష్టపడతారు. ఊరుదాటి వెళితే తిరిగి వస్తామో.. రామోనన్న భయంతో ఇంటివద్దే మంత్రసానులు, ఏఎన్‌ఎంల సాయంతో ప్రసవం జరుపుకుంటారు. ఈ కారణంగా ఎంత నచ్చజెప్పినా గర్భిణులతో పాటు కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వచ్చేందుకు సముఖత వ్యక్తం చేయరు. దీంతో వీరికి అవగాహన కల్పించడంతో పాటు వసతిగృహానికి తీసుకువచ్చేందుకు వైద్య, అంగన్‌వాడీ సిబ్బంది పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. అంతేగాకుండా వసతి గృహానికి వచ్చిన వారిని నెలల తరబడి ఇంటికి, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంచడం కూడా శ్రమతో కూడిన పనవుతోంది.

31 మందికి ప్రసవాలు..
గత నెల 17న ప్రత్యేక వసతిగృహం ప్రారంభం కాగా ఇంతవరకు 31 ప్రసవాలు జరుపుకున్నారు. తల్లీబిడ్డ క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. మొత్తం 36 మంది వసతిగృహానికి చేరుకోగా 31 మంది ప్రసవించారు. ఇందులో 29 మందివి సాధారణ ప్రసవాలు కావడం విశేషం. ఐటీడీఏ పీఓ ఆలోచన సత్ఫలితాలిస్తోందని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కమ్మని ఆహారం.., వైద్యసేవలు..
 ఏడో నెలలోకి అడుగుపెట్టిన గర్భిణులను అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు గుర్తించి వారిని వసతిగృహానికి తీసుకువస్తారు. నెలలు నిండేంతవరకు కమ్మని భోజనాన్ని అందివ్వడంతో పాటు వైద్యపరీక్షలు సైతం క్రమం తప్పకుండా చేపడతారు. ఇద్దరు ఏఎన్‌ఎంలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు బీపీ పరీక్షలు చేపడుతుంటారు. అవసరమైనవారిని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు అందిస్తారు.  ప్రసవానికి పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తూ తల్లీబిడ్డ ఆరోగ్యంతో పాటు ప్రాణాలకు ఎలాంటి ముప్పులేకుండా చర్యలు తీసుకుని ఇంటికి క్షేమంగా పంపిస్తారు.

 తనిఖీలు చేస్తున్నారు..
 నాకు ఏడో నెల రాగానే వసతిగృహానికి చేరుకున్నాను. భోజనం బాగుంది. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. కుటుంబాన్ని వదిలి ఉండడం బాధాగా ఉన్నప్పటికీ, పండంటి బిడ్డతో ఇంటికి వెళ్తానన్న నమ్మకంతో ఉంటున్నాను. వైద్యం సదుపాయం అందుబాటులో లేని గర్భిణులకు వసతిగృహం నిజంగా ఒక వరమే.–  పొర్రజన్ని పార్వతి, గర్భిణి, గుమ్మిడిగుడ, పాచిపెంట మండలం  

మరిన్ని వార్తలు