కర్నూలు మీదుగా డబుల్ డెక్కర్ రైలు

11 Jan, 2014 02:47 IST|Sakshi

డోన్, న్యూస్‌లైన్ : సికింద్రాబాదు నుంచి కర్నూలు, డోన్ మీదుగా తిరుపతి వరకు డబుల్‌డెక్కర్ రైలు సర్వీసును ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక రైలులో కర్నూలు నుంచి తిరుపతికి వెళ్తూ మార్గమధ్యంలో డోన్ రైల్వేస్టేషన్‌లో వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చే రైల్వేబడ్జెట్‌లో తగిన న్యాయం చేస్తానన్నారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి కావలసిన సౌకర్యాలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఫ్యాక్టరీలు, అదనపు రైళ్ల ఏర్పాటుపై అధికారులతో సమీక్షిస్తున్నట్లు తెలిపారు.

 హైదరాబాదు నుంచి నడికుడి మీదుగా విజయవాడకు శతాబ్ది ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాదు నుంచి డోన్ మీదుగా తిరుపతికి డబుల్‌డెక్కర్ రైలు ఏర్పాటు చేస్తామన్నారు. దూపాడు వద్ద రూ.6.50 కోట్ల వ్యయంతో బోగీల మరమ్మతు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని అన్నారు. అందుకోసం త్వరలో భూ సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. డోన్, గుంతకల్, వాడీ మీదుగా ముంబాయి, షిర్డీకి రైలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. డోన్ రైల్వేస్టేషన్‌లో రద్దీ దృష్ట్యా అదనపు ప్లాట్‌పాం ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు.

 ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
 ఇటీవల రైళ్లలో చోటు చేసుకుంటున్న ప్రమాదాలపై విచారణ కమిటీలు ఏర్పాటు చేశామని, నివేదిక వచ్చిన తర్వాత నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ధర్మవరం వద్ద జరిగిన రైలుప్రమాదంలో 26 మంది, ముంబాయి వద్ద 9 మంది మృతి చెందారని, వారి కుటుంబాలకు రైల్వేశాఖ నుంచి ఒక్కోక్కరికి రూ.5 లక్షల పరిహారం అందించామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట హైదరాబాదు ఏడీఆర్‌ఎం రాజ్‌కుమార్, ఏసీఎం భానుప్రకాష్, ఏఈఈ ఉస్మాన్, ఏఓఎం త్రినాథ్‌కుమార్, గుంతకల్ డీఆర్‌ఎం మనోజ్‌జోషీ, సీనియర్ డీసీఎం స్వామినాయక్, సీనియర్ డీఈ ఎన్ సివిల్ మనోజ్‌కుమార్ ఉన్నారు.

 రూ.లక్ష రివార్డు
 అనంతరం ఆయన డోన్ రైల్వేస్టేషన్ లోని విశ్రాంతి గదులను పరిశీలించారు. గదుల్లో పరిశుభ్రతను పాటించినందుకుగాను స్టేషన్ సూపరింటెండెంట్‌కు లక్షరూపాయల రివార్డును ప్రకటించారు. స్టేషన్‌లో ప్రయాణికులకు సరైన వసతులు కల్పించడం, స్టేషన్‌లో సౌకర్యాలు కల్పించడంపై మంత్రి సిబ్బందిని అభినందించారు.

మరిన్ని వార్తలు