కుంభవృష్టితో కకావికలమే!

21 Aug, 2018 03:41 IST|Sakshi
రాజధాని ప్రాంతం రాయపూడిలో ఇళ్లలోకి చేరిన వరద నీరు

కొండవీటి వాగు, కృష్ణానది ఒకేసారి ఉప్పొంగితే రాజధానికి వరద ముప్పు రెట్టింపు

సాక్షి, అమరావతి బ్యూరో: రెండేళ్ల క్రితం చెన్నై మహా నగరాన్ని చుట్టుముట్టిన వరదలు ఇప్పుడు కేరళలో ప్రళయం సృష్టిస్తున్నాయి. మరి కృష్ణా తీరంలో నిర్మిస్తున్న నూతన రాజధానిలో కుంభవృష్టి కురిస్తే అమరావతి పరిస్థితి ఏమిటి? వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో ఏ ఉద్యోగిని కదిలించినా ఇప్పుడు ఇదే ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణ వర్షపాతానికే అమరావతిలో 13,500 ఎకరాలు ముంపు బారినపడుతున్నాయి. అంతకు మించి వర్షపాతం నమోదైతే వరద ప్రభావం అధికంగా ఉంటుంది. రాజధాని ఎంపికపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ కమిటీ కూడా అమరావతి ప్రాంతానికి వరద ముప్పు ఉందని హెచ్చరించిన విషయం తెలిసిందే. సింగపూర్‌ రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌లోనూ వరద ముప్పు హెచ్చరిక ఉంది.

రాజధానికి ముప్పు 3 రకాలు..
కృష్ణానది ఉప్పొంగడం వల్ల రాజధానికి వరద ముప్పు పొంచి ఉంది. కృష్ణానదికి వరదలు రెండు రకాలుగా వస్తాయి. కృష్ణానది పైన మహారాష్ట్ర, కర్ణాటకలో ఉన్న ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉండడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మన రాష్ట్రంలో శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండడంతో నాగార్జునసాగర్‌కు నీరు విడుదలవుతోంది. సాగర్, పులిచింతల నిండిన తర్వాత వచ్చే వరద ప్రవాహం మనకు ముప్పు కలిగించేదే. 


ఎగువన వర్షాలు లేకున్నా భారీ ప్రవాహం
2009లో పశ్చిమ కనుమల్లో కురిసిన వర్షాలతో సంబంధం లేకుండానే  జూరాల–శ్రీశైలం మధ్యన (దూరం 200 కి.మీ.) కురిసిన వర్షంతోనే 24 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కృష్ణాలో నమోదైంది. శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో వరదను నియంత్రించడంతో ప్రకాశం బ్యారేజీకి 11 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చింది. దానికే అమరావతి ప్రాంతంలోని పొలాల్లో 5 అడుగుల మేర నీళ్లు చేరాయి. ఇక 24 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి పడితే? జూరాల–శ్రీశైలం మధ్య ఉన్నదంతా కరువు ప్రాంతం. అత్యంత భారీ వర్షాలను ఊహించలేం. నాగార్జునసాగర్‌–ప్రకాశం బ్యారేజీ మధ్య భారీ ప్రవాహాలకు అవకాశం ఉన్న పలు ఉపనదులు, వాగులు, వంకలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరద అంతా ఈ ఉపనదులు, వాగులు, వంకల నుంచి వస్తున్నదే. పైనుంచి వరద పోటుకు తోడు సాగర్‌ దిగువన కూడా వర్షాలు కురిస్తే కృష్ణానది ఉప్పొంగుతుంది. అది రాజధాని ప్రాంతానికి ప్రమాదకరం.

మెరుపు వరద చుట్టుముడితే?
స్థానిక వర్షాల వల్ల కొండవీటి వాగుకు మెరుపు వరద(ప్లాష్‌ ఫ్లడ్‌) వచ్చే అవకాశం ఉంది. ఇటీవల వర్షాలకు గుంటూరు–అమరావతి మధ్య రాకపోకలు నిలిచిన విషయం విదితమే. కేరళలో గరిష్టంగా ఒకరోజులో 310 మి.మీ. వర్షం కురిసింది. ఆ రాష్ట్రంలోని దాదాపు అన్ని డ్యాముల గేట్లు తెరిచారు. ఫలితంగా వరద ముంచెత్తింది. రెండేళ్ల క్రితం చెన్నైలో 490 మి.మీ. వర్షపాతం నమోదైనప్పుడు కూడా నగరాన్ని వరద ముంచెత్తింది. అందులో సగం వర్షపాతం నమోదైనా సరే అమరావతికి వరద ముప్పు తప్పదనే ఆందోళన సాగునీటిశాఖ ఇంజనీర్లలో నెలకొంది. దాదాపు 30 కిలోమీటర్ల పొడవైన కొండవీటి వాగు క్యాచ్‌మెంట్‌ ఏరియా చాలా ఎక్కువ. సాధారణ సమయాల్లో కొండవీటి వాగులో 4–5 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంటుంది. ఫ్లాష్‌ ప్లడ్‌ వస్తే 10 రెట్లు అధికంగా ఉంటుందని ఇంజనీర్ల అంచనా. ఇక కుంభవృష్టి కురిస్తే వరద దాదాపు 25 వేల క్యూసెక్కులకు చేరుతుందని, గంటల వ్యవధిలోనే రాజధానికి వరద నీరు చేరుతుందనే ఆందోళనే సాగునీటి నిపుణుల్లో ఉంది. అటు కృష్ణానది, ఇటు కొండవీటివాగులో ఒకేసారి భారీ ప్రవాహం ఉంటే రాజధానికి వరద ముప్పు రెట్టింపవుతుంది. కొండవీటివాగు నుంచి 4–5 వేల క్యూసెక్కుల నీటిని లిఫ్ట్‌ ద్వారా మళ్లించినా ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

వరద ప్రాంతాల్లో వద్దన్న శివరామకృష్ణన్‌ కమిటీ
ప్రతి పదేళ్లలో ఒకసారి వరదలు రావడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయకూడదని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో విజయవాడ–గుంటూరు పరిసరాల్లో రాజధాని ఏర్పాటు యోచన సరికాదని కమిటీ హెచ్చరించింది. 

మరిన్ని వార్తలు