పులి చంపిందా..హత్య జరిగిందా.?

15 Oct, 2014 01:57 IST|Sakshi
పులి చంపిందా..హత్య జరిగిందా.?

గిద్దలూరు : నల్లమల అడవిలోని ఇసుకగుండాల బీట్‌లో విధులు నిర్వహిస్తూ మూడు రోజుల క్రితం అదృశ్యమైన ట్రైబల్ వాచర్ బర్నాసి రంగస్వామి ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఆచూకీ మంగళవారం కూడా లభ్యం కాలేదు. రంగస్వామి కనిపించడంలేదంటూ అతని భార్య, తల్లిదండ్రులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన ఎస్సై ఎం.రాజేష్ విచారణ ప్రారంభించారు.

స్థానిక పోలీసులతో పాటు అటవీశాఖ గుంటూరు డివిజన్ చీఫ్ కన్జర్వేటర్ పీవీ చలపతిరావు, టైగర్ విభాగం సీసీఎఫ్ ఏకే నాయక్, శ్రీశైలం ఎఫ్‌డీపీటీ రాహుల్‌పాండే, స్థానిక డీఎఫ్‌వో చంద్రశేఖరరావులు స్థానిక రేంజర్లు, సిబ్బందితో కలిసి మంగళవారం ఇసుకగుండాల ప్రాంతానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 40 మంది అధికారులు, సిబ్బంది కలిసి రంగస్వామి ఆచూకీ కోసం అడవిలో గాలిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించలేదని ఎస్సై ఎం.రాజేష్ తెలిపారు.

పలు అనుమానాలు...
ట్రైబల్ వాచర్‌గా పనిచేస్తున్న రంగస్వామి అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగస్వామిని చిరుతపులి చంపిందని, సోమవారం సాయంత్రం అదే ప్రదేశానికి పులి మళ్లీ వచ్చిందని, రంగస్వామి భార్యను వెంబడించగా అక్కడున్న అటవీశాఖ సిబ్బంది వాహనం లైట్లు వేయడంతో పారిపోయిందని వారు చెప్పుకొచ్చారు. పులి చంపి ఉంటే ఆ సమీపంలో రక్తం మరకలు ఉండాలి. కానీ ఇంతమంది అధికారులు, సిబ్బంది రెండురోజుల పాటు వెతికినా ఆ ప్రదేశంలో ఎలాంటి ఆనవాల్లు కనిపించలేదు. దీంతో పులి చంపిఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. మరో కారణం ఏమైనా ఉందా అని విచారిస్తున్నారు.

గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపే ముఠాలపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎత్తు ప్రదేశాల నుంచి నీరుపడే ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతున్నాయని, మావోయిస్టులు గతంలో డంప్‌లు దాచారని, గుప్తనిధులు ఉన్నాయని అనేక ముఠాలు ఇటీవల నల్లమల అడవుల్లో రహస్యంగా తిరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వారేమన్నా రంగస్వామిని హత్యచేసి ఉంటారేమోనని అటవీశాఖాధికారులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కూడా వారు విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు