ఆమ్వే ‘గొలుసు’ తెగిందా?

28 May, 2014 00:36 IST|Sakshi

 విశాఖపట్నం, న్యూస్‌లైన్: గొలుసు వ్యాపారంలో పేరొందిన ఆమ్వే సంస్థ మనుగడపై  సందేహాలు రేకెత్తుతున్నాయి. ఈ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్కాట్ పింక్నీని ఒక చీటింగ్ కేసులో కర్నూలు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారన్న వార్తలు రావడంతో విశాఖలోని ఏజెంట్లు, వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా ఈ సంస్థపై పలు ఆరోపణలు రావడం, వాటిని సంస్థ ఖండిస్తూ వార్తా పత్రికలలో ప్రకటనలు ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంస్థ సీఈఓ అరెస్టు కావడంతో సంస్థ ఉంటుందా మూతపడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమ్వేకు జిల్లాలో వేలాది సంఖ్యలో ఏజెంట్లు ఉన్నారు.
 
ప్రతినెలా రూ. కోట్లలో వ్యాపారం జరుగుతోంది. ఈ సంస్థ కార్యాలయం కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఉంది. సంస్థ ఏజెంట్లు పలు రకాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా గొలుసుకట్టు విధానంలో సాగుతుంది. ప్రపంచంలోని 88 దేశాలలో డెరైక్ట్ సెల్లింగ్ బిజినెస్ విధానంలో ఆమ్వే సంస్థ పేరు ప్రఖ్యాతులు గడించింది. సంస్థ తరఫున 450 రకాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నారు. ఆమ్వే సంస్థ ఏజెంట్లలో పలువురు ప్రముఖులు, అధికారుల బంధువులు కూడా ఉన్నారు. ఆమ్వే ఉత్పత్తులను డెరైక్ట్ మార్కెటింగ్ పేరుతో విక్రయిస్తున్నా అధిక ధరలు ఉండడం పలువురిని ఆలోచింపజేస్తోంది.

మరిన్ని వార్తలు