ట్రిపుల్‌ ఐటీ ఫ్యాకల్టీ నోటిఫికేషన్‌పై సందేహాలెన్నో?

22 May, 2018 12:01 IST|Sakshi
ఆర్జీయూకేటీ నూజివీడు క్యాంపస్‌

రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో కాంట్రాక్టు పద్ధతిన ఫ్యాకల్టీల నియామకానికి ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పారదర్శకత లోపించడంతో అనేక  సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న సిబ్బంది, దరఖాస్తు చేసుకోవాలనుకునే వారిలో గందర గోళం ఉంది.

నూజివీడు : రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో కాంట్రాక్టు పద్ధతిన ఫ్యాకల్టీల నియామకానికి ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పారదర్శకత లోపించడంతో అనేక  సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంజినీరింగ్‌కు సంబంధించి సివిల్, మెకానికల్, ఈసీఈ, సీఎస్‌ఈ, కెమికల్, ఎంఎంఈ బ్రాంచిలకు, సైన్స్‌ సబ్జెక్టులైన గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జంతుశాస్త్రం, హ్యుమానిటీస్, సోషల్‌ సైన్స్‌లకు ఫ్యాకల్టీలు కావాలని ఈనెల 15న నోటిఫికేషన్‌ జారీచేశారు. వీటికి అర్హులైన వారు ఈనెల 29 సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్‌పై ప్రస్తుతం ఉన్న సిబ్బందిలోను, దరఖాస్తు చేసుకోవాలనుకునే వారిలోను అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రోస్టర్‌ పాయింట్‌ పాటిస్తారా...లేదా..?
ఏ ప్రభుత్వ విద్యాసంస్థ అయినా కాంట్రాక్టు పద్ధతిపై నియామకాలు చేస్తున్నప్పుడు కచ్చితంగా రోస్టర్‌పాయింట్‌ పాటించాలి. ఆర్జీయూ కేటీ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో రోస్టర్‌ పాయింట్‌ విధానం అమలుచేస్తారా, లేదా అనేది పేర్కొనలేదు. అభ్యర్థులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ రోస్టర్‌పాయింట్‌ విధానం అమలైతే దరఖాస్తుతోపాటు కుల ధ్రువీకరణ పత్రాలను కూడా జతచేయాల్సి ఉంటుంది. ఈ వివరాలేమీ నోటిఫికేషన్‌లో పేర్కొనకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.

పోస్టులపై స్పష్టత లేదు
నాలుగు ట్రిపుల్‌ ఐటీలలో కలిపి 300పోస్టులపైనే ఫ్యాకల్టీలను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకుంటామని పేర్కొన్నారే తప్పితే ఏ సబ్జెక్టుకు ఎంతమంది అనే వివరాలు పొందుపరచలేదు. ఇంజినీరింగ్‌కు సంబంధించి సివిల్, కంప్యూటర్‌ సైన్స్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్, కెమికల్, మెటీరియల్స్‌ అండ్‌ మెటలర్జికల్స్‌ బ్రాంచిలతోపాటు గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జంతుశాస్త్రం, ఇంగ్లీష్, తెలుగు, మేనేజ్‌మెంట్, ఫైన్‌ఆర్ట్స్, యోగా, సైకాలజీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, లైబ్రరీ సైన్స్‌ తదితర సబ్జెక్టులకు ఫ్యాకల్టీలను నియమిస్తున్నామని తెలిపారే తప్పితే ఏ సబ్జెక్టుకు ఎంత మంది అవసరమో తెలపలేదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్రిపుల్‌ఐటీల వారీగా నోటిఫికేషన్‌ జారీచేయకుండా అన్నిటికి కలిపి ఒకే నోటిఫికేషన్‌ జారీచేశారు. అంతేగాకుండా ఇంజినీరింగ్‌ ఫ్యాకల్టీకి, పీయూసీ ఫ్యాకల్టీలకు ఎంతెంత జీతాలు చెల్లిస్తారో కూడా పేర్కొనలేదు. దరఖాస్తులో ఏ ట్రిపుల్‌ఐటీకి దరఖాస్తు చేసుకుంటున్నారనే ఆప్షన్‌ కూడా ఇవ్వలేదు. గతంలో ఏ ట్రిపుల్‌ఐటీకి ఆ ట్రిపుల్‌ఐటీనే నోటిఫికేషన్‌ జారీచేసి ఫ్యాకల్టీలను నియమించుకునే వారు. అందుకు భిన్నంగా ఇప్పుడు యూనివర్శిటీనే భర్తీ చేస్తున్నప్పటికీ నోటిఫికేషన్‌ పారదర్శకంగా లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు