ఎందుకొచ్చిన గోల..!

2 Aug, 2013 03:52 IST|Sakshi
విజయనగరం: రాష్ట్రం ఉంతే నాకేటి...ఊడితే నాకేటి..?? జనం ఏటైపోతే నాకేటి... ??? ఇవన్నీ కాదుగానీ ‘మరి నాకేటి...??’ అన్నట్లుంది పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యవహారశైలి. దశాబ్దాలుగా కలిసున్న తెలుగు ప్రజలను నిలువునా చీల్చిన కాంగ్రెస్ అధిష్టానం తీరును ప్రజలు తీవ్రంగా గర్హిస్తూ రోడ్లెక్కుతున్నారు. రెండ్రోజులుగా జిల్లాలో ఏ మూల చూసినా ఇదే హడావుడి కనిపిస్తోంది. అయితే ఈ విషయమై నేతలు ఏమాత్రం స్పందించడం లేదు. అసలు ఈ వ్యవహారంతో తమకు ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన బొత్స సత్యనారాయణ వ్యవహార శైలి మరీ అనుమానాస్పదంగా ఉందని సమైక్యాంధ్ర పోరాట సమితి నేతలు అంటున్నారు. 
 
 సామాన్యం జనం, విద్యార్థులు, యువజన సంఘాలు సైతం సమైక్యాంధ్ర కోసం గళమెత్తినా కీలకమైన బాధ్యతల్లో ఉన్న సత్తిబాబు మాత్రం కిమ్మనకపోవడం వెనుక ఏదో బలమైన రాజకీయ కారణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనకు లాభం లేకుండా ఏ పనీ చేయని నైజమున్న సత్తిబాబు ఇప్పుడు ఈ విపత్కాలంలోనూ ఏదైనా స్వప్రయోజనాన్ని ఆశిస్తున్నారా? అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ముందే రెండు రాష్ట్రాలుగా విభజించి, ఇద్దరు సీఎంలను, ఇద్దరు పీసీసీ అధ్యక్షులను నియమిస్తారన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో విభజనకు వ్యతిరేకంగా మాట్లాడి అధిష్టానం వద్ద చెడ్డ అవడం ఎందుకని బొత్స మౌనంగా ఉంటున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
 ఒకవేళ సీఎంను మార్చే పరిస్థితులు వస్తే ఆ అవకాశం తనకు రాకుండాపోతుందా? ఇలాంటపుడు రాష్ట్రం, జనం ఎటుపోతే నాకేటి? అన్నతీరున మౌనంగా ఉంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది వరకే సీఎం కిరణ్‌తో తనకున్న విభేదాలను ఇప్పుడు మరింతగా రాజేసి సీమాంధ్ర సీఎం పోస్టు దక్కించుకునే ఆలోచనలో ఉన్నందునే ఇప్పుడు కిమ్మనడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో గురువారం విజయనగరంలో ఉన్న సత్తిబాబు ఇంటిని సైతం ఉద్యమ కారులు చుట్టుముట్టారు. ఇలాంటి తరుణంలోనైనా ఆయన కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో ‘సత్తిబాబు ఢిల్లీలో పదవి కోసం బేరసారాల్లో ఉన్నట్లుంది. ఇక్కడ ఎంత గోల చేసినా ఆయనకు వినిపించదు’ అనుకుంటూ ఆందోళనకారులు వెనక్కొచ్చేశారు. భార్యాభర్తలిద్దరూ ఢిల్లీలో పదవుల కోసం లాబీయింగ్ చేస్తూ ఇక్కడి పరిస్థితులను పూర్తిగా విస్మరించడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది.
 
>
మరిన్ని వార్తలు