డీజీపీగా ఠాకూర్‌ నియామకంపై నీలినీడలు!

18 Jan, 2019 02:51 IST|Sakshi

పంజాబ్, హరియాణా, కేరళ, పశ్చిమ బెంగాల్‌ వినతులను తిరస్కరించిన న్యాయస్థానం  

ఏపీలోనూ సొంత చట్టం ద్వారా డీజీపీ నియామకం  

రాజకీయ ప్రయోజనాల కోణంలోనే డీజీపీనినియమించిన సీఎం చంద్రబాబు  

ఎంపిక ప్రక్రియను యూపీఎస్సీ నుంచి తప్పించేందుకు చట్టానికి సవరణలు

సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా వెల్లడించిన తీర్పు నేపథ్యంలో రాష్ట్ర డీజీపీగా ఆర్పీ ఠాకూర్‌ నియామకంపై నీలినీడలు అలుముకున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు మేరకు డీజీపీ ఠాకూర్‌ నియామకం చట్ట విరుద్ధమేనని తేటతెల్లమైంది. తమ సొంత చట్టాల ద్వారా డీజీపీ నియామకానికి అనుమతించాలని కోరుతూ పంజాబ్, హరియాణా, కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. రాష్ట్రాల సొంత చట్టాల ద్వారా డీజీపీ నియామకాలు చెల్లవని
స్పష్టం చేసింది. అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ జోక్యంతోపాటు  ప్రజల రక్షణను దృష్టిలో ఉంచుకునే రాష్ట్రాల సొంత చట్టాల ద్వారా డీజీపీ నియామకం చెల్లదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ గుర్తుచేశారు. అలాగే యాక్టిం గ్‌ డీజీపీ నియమాకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేయరాదని పేర్కొన్నారు. యాక్టింగ్‌ డీజీపీ పేరుతో వారి పదవీ కాలాన్నీ ఏళ్ల తరబడి పొడిగిస్తున్నారని, ఇది ఎంతమాత్రం భావ్యం కాదని తేల్చిచెప్పారు. రాష్ట్రాల డీజీపీ నియమాకానికి సీనియారిటీ మేరకు వారి సర్వీసులోని అంశాలను జోడించి ముగ్గురు పేర్లను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌కు(యుపీఎస్సీ) పంపించాల్సి ఉందని, అందులో నుంచి ఒకరిని యూపీఎస్సీ ఎంపిక చేస్తుందని, అలా ఎంపిక చేసిన వ్యక్తిని డీజీపీగా రాష్ట్రాలు నియమించాల్సి ఉంటుందని జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తన తీర్పులో వెల్లడించారు.  
 
చంద్రబాబు సొంత చట్టం  
2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు యూపీఎస్సీ ద్వారానే డీజీపీని నియమించాల్సి ఉంటుంది. యూపీఎస్సీకి మూడు పేర్లు పంపిస్తే తనకు కావాల్సిన వారిని, రాజకీయంగా ఉపయోగపడే వ్యక్తిని డీజీపీగా నియమించుకోవడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. అందుకే డీజీపీ ఎంపిక ప్రక్రియను యూపీఎస్సీ నుంచి తప్పించేందుకు ఏకంగా చట్టంలో సవరణలు తీసుకొచ్చారు. రాష్ట్ర సొంత చట్టం మేరకే డీజీపీని నియమించాలని నిర్ణయించారు. 2018 జూన్‌ 30వ తేదీన యాక్టింగ్‌ డీజీపీగా పనిచేస్తున్న మాలకొండయ్య పదవీ విరమణ చేశారు. ఆయన పదవీ విరమణ చేసే చివరి నిమిషం వరకూ కొత్త డీజీపీ ఎవరనేది చంద్రబాబు తేల్చలేదు. చివరి నిమిషంలో ఐదుగురు పేర్లతో సీనియారిటీ జాబితా రూపొందించినట్లు కథ నడిపించారు. గౌతమ్‌ సవాంగ్, ఆర్పీ ఠాకూర్, కౌముది, సురేంద్రబాబు, అనూరాధ పేర్లతో సీనియారిటీ జాబితా రూపొందించామని, అందులో నుంచి ఆర్పీ ఠాకూర్‌ను డీజీపీగా నియమించినట్లు తెలిపారు. వాస్తవానికి గౌతమ్‌ సవాంగ్‌ డీజీపీ అవుతారని అందరూ భావించారు. ఆయన రాజకీయంగా ఉపయోగపడరనే ఉద్దేశంతోనే ఆర్పీ ఠాకూర్‌ వైపు చంద్రబాబు మొగ్గుచూపినట్లు సమాచారం. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో డీజీపీగా ఠాకూర్‌ నియమాకం చట్ట విరుద్ధమే అవుతుందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సి ఉందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.  
 
డీజీపీనా.. రాజకీయ నాయకుడా?  
డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ రాష్ట్ర ప్రభుత్వం పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, డీజీపీ అనే విషయాన్ని మరిచిపోయి రాజకీయ నేతగా మాట్లాడుతున్నారని అధికార యంత్రాంగం చెబుతోంది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై డీజీపీ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇలాంటి వ్యక్తి డీజీపీగా కొనసాగితే వచ్చే సాధారణ ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేదని ఉన్నతాధికారి ఒకరు అన్నారు. రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేసిన డీజీపీలను ఎన్నికల కమిషన్‌ గతంలో ఎన్నికల విధుల నుంచి తప్పించి, కొత్తవారిని నియమించిందని ఆయన గుర్తు చేస్తున్నారు.    

మరిన్ని వార్తలు