విద్యార్థులకు తాయిలాలు!

15 Sep, 2013 02:45 IST|Sakshi
 ఎచ్చెర్ల క్యాంపస్,న్యూస్‌లైన్:డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలోని సహాయ కేంద్రలో ఐసెట్-2013 వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన కొనసాగుతోంది. ఈ నెల 15 నుంచి వెబ్ ఆప్షన్లు విద్యార్థులు ఇచ్చుకోవల్సి ఉంటుంది. ఎంసీఏ, ఎంబీఏ అడ్మిషన్లు ఏటా తగ్గుతున్నాయి. దీంతో ప్రైవేటు యాజమాన్యాలు ఆడ్మిషన్లు పెంచుకోవడం కోసం అక్రమార్గాలను సైతం తొక్కుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అమాయక విద్యార్థులకు డబ్బు ఎర వేస్తున్నారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన అనంతరం అందజేసే స్క్రాచ్ కార్డు, రిజస్ట్రేషన్ కెం వెరిఫికేషన్ ఫారాలను విద్యార్థుల నుంచి తీసుకుంటున్నారు. ఇందుకు ప్రతిగా విద్యార్థికి రూ. 10 వేలు వరకు అందజేస్తున్నట్టు తెలిసింది. విద్యార్థులు ఇచ్చుకోవల్సిన అప్షన్లను కళాశాల యాజమాన్యాలే తమకు అనుకూలంగా ఇచ్చి వారికి తీరని ద్రోహం చేస్తున్నాయి. ప్రస్తుతం విశాఖపట్నంలో ఐసెట్ వెబ్  కౌన్సెలింగ్ సమైక్యాంధ్ర సెగతో  జరగటం లేదు.
 
 దీంతో అక్కడ నుంచి ఇక్కడ సహాయ కేంద్రానికి అధిఖ సంఖ్యలో విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిని ప్రైవేటు యాజమాన్యాలు ట్రాఫ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. మన జిల్లాతో పాటు విశాఖ ప్రాంతానికి చెందిన కళాశాలు కూడా అడ్మిషన్ల పైనే దృష్టి పెట్టాయి. ఎక్కువగా రీయింబర్స్‌మెంట్ వర్తించే విద్యార్థులనే ట్రాఫ్ చేసి స్క్రాచ్ కార్డు, ఆర్‌సీవి ఫారాను వారినుంచి తీసుకుంటున్నారు. ముందుగా రూ. 10 వేలు ఇస్తామని, కళాశాలలో చేరాక ఫీజు చెల్లించనవసరం లేదని, రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లతో చదువుకోవచ్చునని ప్రలోభ పెడుతున్నారు. అయితే వాస్తవంగా విద్యార్థులు ఓ విషయాన్ని ఇక్కడ గమనించాలి. అమాయకంగా చేరాక వసతిగృహం ఫీజులు, బిల్డింగ్ ఫండ్, కాలేజ్ డెవలఫ్‌మెంట్ ఫండ్ వంటివి బలవంతంగా వసూలు చేస్తారు. బదిలీ ధ్రువీకరణ పత్రం తీసుకొని మరో కళాశాలలో చేరటం సాధ్యం కాదు. 
 
 మరోపక్క ఉపాధి అవకాశాలను కోల్పోవల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు అప్రమతంగా ఉండకపోతే విలువైన భవిష్యత్‌ను కోల్పోవడం ఖాయం. చాలామంది విద్యార్థులు కళాశాలలో చేరాక తమ ఇబ్బందులు వేరొకరకి చెప్పుకోలేని విధంగా ఇరుక్కుంటున్నారు. విద్యార్థులు స్క్రాచ్ కార్డు, రిజిస్ట్రేషన్ కెం వెరిఫికేషన్ ఫారాన్ని అందజేశాక అందులో పూర్తి సమాచారం ఉంటుంది. స్క్రాచ్ కార్డు రహస్య నంబర్ పాస్ వర్డుగా ఇస్తారు. మళ్లీ విద్యార్థులు వెబ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు మార్చుకోవటం కూడా సాధ్యం కాదు. స్క్రాచ్ కార్డులు పైవేటు వ్యక్తులు అక్రమంగా కొనేయటం, పాస్‌వర్డు రహస్య నంబర్ హ్యాకింగ్ అవ్వటం వంటి సమస్యల వల్ల వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేసి మళ్లీ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావించింది. అందుకే మొబైల్ నంబర్‌తో మెసేజ్ అలర్టు అనుసంధానం చేసింది. దీంతో ఆప్షన్లను అక్రమంగా ఎవరైనా మార్చినా మెసేజ్ వస్తుంది. అయితే స్క్రాచ్ కార్డే వారి వద్ద లేక పోతే విద్యార్థులు మోసపోక తప్పదు.
 
 మా దృష్టికి తెస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తా
 స్క్రాచ్‌కార్డు, రిజస్ట్రేషన్ కెం వెరిఫికేషన్ ఫారాలను ప్రైవేటు యాజమాన్యాలకు, బయట వ్యక్తులకు విద్యార్థులు ఇవ్వవద్దు. ప్రలోభాలకు లొంగితే ఉజ్వల భవిష్యత్తు కోల్పోతారు. విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలను ఎంచుకోవాలి.  ఎవరైనా బలవంతంగా ప్రలోభ పెట్టినా, స్క్రాచ్ కార్డు తీసుకున్నట్టు మా దృష్టికి తీసుకొస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తా.
 - ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్,వీసీ, బీఆర్‌ఏయూ
 
>
మరిన్ని వార్తలు