ఏయ్‌ ఎక్కడికిపోయావ్‌ రా..?

3 Dec, 2018 11:21 IST|Sakshi

తన వద్ద పనిచేసే దఫేదార్‌ఫై విశాఖ డీఆర్‌డీఏ పీడీ ఆగ్రహం

ప్రభుత్వ వాహనాలు, సిబ్బందితోనే షూటింగ్‌ స్పాట్‌కు..

సాక్షి, కాకినాడ ప్రతినిధి: అది కాకినాడ నగరంలోని మెక్లారిన్‌ హైస్కూల్‌.. శంకర్‌దాదా సినిమాలోలా ఆ స్కూల్‌కు ఓ ఆస్పత్రి బోర్డు తగిలించారు. ఇక అంబులెన్స్‌లు ఇతరత్రా వాటిని కూడా అక్కడ ఏర్పాటు చేసి.. ఆస్పత్రి వాతావరణాన్ని తలపించేలా సిద్ధం చేశారు. ఏంటని ఆరా తీస్తే.. అది విజయదేవరకొండ హీరోగా మైత్రి ప్రొడక్షన్‌ నిర్మిస్తున్న ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా కోసం వేసిన సెట్టింగ్‌ అని తేలింది.

కట్‌ చేస్తే..
ఇంతలో అక్కడికి ప్రాజెక్టు డైరెక్టర్‌ డీఆర్‌డీఏ, విశాఖపట్నం పేరున్న బోర్డుతో నలుపురంగులో ఉన్న ఓ వాహనం వచ్చి ఆగింది. అందులో నుంచి ఓ వ్యక్తి దిగారు.. మంచి టిప్‌టాప్‌గా ఉన్న ఆయనకు అస్సలు ఎండతగలకుండా పక్కన ఓ దఫేదారు గొడుగుపట్టుకుని ఆయనను అనుసరించాడు. ఆయన నేరుగా ఆస్పత్రిలా వేసిన సెట్టింగ్‌లోకి వెళ్లారు.

మళ్లీ కట్‌ చేస్తే..
కొంత సేపటికి లోపలకు వెళ్లిన ఆయన చాలా కోపంగా బయటకి వచ్చారు. ‘‘ఏయ్‌ ఎక్కడికి పోయావ్‌రా?.. నేను నిన్ను వెతుక్కోవాలా.. ఏం నేను రావాలా వెనక్కి మళ్లీ సెల్‌ తీసుకోవడానికి అంటూ (రాయడానికి వీల్లేది తిట్లతో)  ఆ దఫేదార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతే పాపం ఆ దఫేదార్‌ తెల్లముఖం వేసి.. ఆయన వెంట కుర్చీ పట్టుకుని నడుచుకుంటూ వెళ్లాడు.. ఇంతకీ ఆయన ఎవరని ఆరా తీస్తే.. ఆయన విశాఖ జిల్లా డీఆర్‌డీఏ పీడీ సత్యశ్రీనివాస్‌ అని.. ఆయనకు సినిమాల్లో నటించడం హాబీ అని తేలింది.

విశాఖ డీఆర్‌డీఏ పీడీ సత్యశ్రీనివాస్‌ తన నోటికి పనిచెప్పారు. తన వెంట ఉండే దఫేదార్‌ను నానా బూతులు తిడుతూ దుర్భాషలాడారు. అంతేకాదు తన సొంత పనులకు ప్రభుత్వ వాహనాలను, సిబ్బందిని వినియోగిస్తూ మీడియాకు చిక్కారు. గతంలోనూ ఈయన పలు వివాదాస్పద వ్యవహారాల్లోనూ చిక్కుకొని విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా కాకినాడలో ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు ఆయన ఆదివారం వచ్చారు. అయితే నేరుగా ప్రభుత్వ వాహనంలోనే ఆయన తన దఫేదార్, ప్రభుత్వ డ్రైవర్‌ను వెంట తీసుకువచ్చారు. సినిమా చిత్రీకరణ జరిగినంత సేపు సిబ్బంది ఆయన వెంటే ఉన్నారు. ఆయనను నీడలా వెంటపెట్టుకునే ఉన్నారు. ఒకానొక దశలో దఫేదార్‌ ఆయన వెంట లేకపోవడంతో పీడీకి చిర్రెత్తుకొచ్చింది. అంతే తన నోటికి పని చెప్పారు. ఇష్టానుసారంగా దఫేదార్‌పై అందరూ చూస్తుండగానే విరుచుకుపడ్డారు. ఆయన దుర్భాషలాడిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అయ్యాయి.


డీఆర్‌డీఏ పీడీ సత్యశ్రీనివాస్‌, షూటింగ్‌ స్పాట్‌లో ప్రభుత్వ వాహనం

జిల్లా పంచాయతీ అధికారి కూడా..
మరోవైపు తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ ఇన్‌చార్జ్‌ అధికారి ఆనంద్‌ కూడా ఈ సినిమా షూటింగ్‌లో ఉన్న డీఆర్‌డీఏ పీడీని కలిసేందుకు మెక్లారిన్‌ హైస్కూల్‌కు వచ్చారు. ఆయన కూడా ప్రభుత్వ వాహనంలోనే తన సిబ్బందిని వెంట పెట్టుకుని వచ్చారు. సినిమా చిత్రీకరణలో సుమారు రెండు గంటల పాటు అక్కడే గడిపారు. పీడీ సినిమా చిత్రీకరణలో ఉండడంతో ఆయన కోసం అక్కడే వేచి ఉన్నారు. అయితే విశాఖ డీఆర్‌డీఏ పీడీ విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా.. ‘‘నాకు సత్యశ్రీనివాస్‌ స్నేహితుడని, అందుకే ఆయనను కలవడానికి వచ్చాను’’ అని సమాధానమచ్చారు. దఫేదార్‌ను దుర్భాషలాడిన విషయం తనకు తెలియదన్నారు.

నిబంధనల ప్రకారం..
ఏ అధికారైనా తన వ్యక్తిగత పనులకు ప్రభుత్వ వాహనాలను, సిబ్బందిని వినియోగించకూడదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా అధికారులు ఇలా యథేచ్ఛగా ప్రభుత్వ అధికారాలను, వాహనాలను, దుర్వినియోగం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు తన కిందిస్థాయి సిబ్బందిని ఇలా దుర్భాషలాడడంపైనా పలువురు మండిపడుతున్నారు. షూటింగ్‌ కోసం వచ్చిన వ్యక్తి ఇలా ప్రభుత్వ వాహనాలను వాడడం ఏంటని పలువురు ఆశ్చర్యపోయారు.

మరిన్ని వార్తలు