సొంతిల్లు కలే!

11 Jun, 2014 00:09 IST|Sakshi
సొంతిల్లు కలే!

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. పెళ్లిమాటెలా ఉన్నా రోజురోజుకు భవన నిర్మాణ సామగ్రి ధరలు చుక్కల నంటుతుండటంతో ఇల్లు కట్టే పరిస్థితి లేకుండా పోతోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు సొంతిల్లు కలగానేమిగిలిపోతోంది. భవన నిర్మాణం చేపట్టాలంటే పునాది వేసింది మొదలు ఇటుక,ఇసుక, ఇనుము, సిమెంటు తదితర సామగ్రి కొనాలంటే తడిచి మోపెడవు తోంది. దీంతో నిర్మాణ రంగం కూడా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది.గత ఏడాది శరవేగంగా సాగిన పనులు ప్రస్తుతం మందగించాయి.ఫలితంగా కూలీలకూ ఉపాధి కరువైంది.  

సొంతింటి నిర్మాణం సామాన్యుడికి మరింత భారమైంది. భవన నిర్మాణ సామగ్రి ధరలు అమాంతంగా పెరిగి పోయా యి. జిల్లాలో రోజుకు దాదాపు 60 వేల బస్తాల సిమెంట్ విక్రయాలు జరుగుతున్నాయి. కాగా గతంతో పోల్చితే బస్తాకు 70 రూపాయల భారం పడింది. కొందరు నేరుగా  కంపెనీల నుంచి, మరికొందరు ప్రభుత్వ రంగ, నిర్మాణ సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం 50 కేజీల సిమెంటు (సాధారణ ) బస్తా ధర రూ. 235 వరకు ఉండగా, తాజాగా రూ. 295కు చేరింది. అదే 53 గ్రేడ్ రకం, రూ. 240 నుంచి రూ. 305కు చేరడం గమనార్హం.

కృతిమ కొరతే.... సిమెంటు పరిశ్రమలపై ప్రభుత్వానికి పట్టు లేకపోవడందో ధరలను అదుపు చేయలేకపోతుందని భవన నిర్మాణ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ధరలను కంపెనీలు పెంచాయి. డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా చేయడంలేదు. ఫలితంగా మార్కెట్‌లో సిమెంటు అమ్మకాల జోరు తగ్గింది. కృత్రిమ కొరత కారణంగా నిర్మాణాల సీజన్ కాకపోయినా సిమెంటు ధరలు అమాంతం పెరిగాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. రుతుపవనాల రాకతో, వర్షాలు ప్రారంభం కానుండటంతో నిర్మాణాలు పెద్దగా జరగడం లేదు. మరో 7, 8 నెలలపాటు ఇదే పరిస్థితి ఉండే అవకావశం ఉంది.

అమాంతం పెరిగిన ఇనుము ధర...

గత ఏడాది టన్ను ఇనుము రూ. 42వేలు ఉంది. ప్రథమ, ద్వితీయ, ప్రథమ శ్రేణి రకాల ధరలు పెరిగి పోయాయి. నాణ్యత తక్కువగా ఉండే స్టీలు టన్ను ధర రూ. 47వేలు, మేలు రకం రూ. 54వేల వరకు ఉంది. గృహనిర్మాణాల్లో పిల్లర్లు, బెడ్లు, పైకప్పు నిర్మాణాలే కీలకం, వాటికి  కంకర వినియోగం తప్పనిసరి. కంకర కోనుగోలు నిర్మాణదారులకు తలకు మించిన భారంగా మారింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది యూనిట్ కంకరకు రూ.700 పెరిగింది. దీనికి తోడు కూలీ, రవాణా ఖర్చులు అదనంగా భారం తప్పడం లేదు. అదేవిధంగా ఇటీవల వరకు రూ.3800 పలికిన వెయ్యి ఇటుకలు ప్రస్తుతం రూ. 4,250  పలుకుతున్నాయి. నేనేమీ తక్కువ కాదన్నట్లు ఇసుక ధర చుక్కలనంటుతోంది. టన్ను  రూ. 3వేల నుంచి రూ. 5వేల వరకు పలుకుతోంది. ఇందిరమ్మ పథకం ద్వారా ఇచ్చే డబ్బుకు ఇల్లు పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో నిర్మాణం కోసం రుణం చేయాల్సిన పరిస్థితి నెలకొందని లబ్దిదారులు వాపోతున్నారు.
 
వ్యాపారాలు వెలవెల..

విద్యుత్ కోత కారణంగా సిమెంటు ఉత్పత్తి కష్టమవుతోంది. దీంతో కంపెనీలు ధరలు పెంచాయి. విద్యుత్ కోతలు మార్చి నుంచి మొదలైన ధరల పెరుగుదల మాత్రం మే నెల నుంచి జరిగింది. కంపెనీలన్నీ పెంపు నిర్ణయం తీసుకున్నాయి. నెల రోజులుగా వ్యాపారం 60 శాతం మందగించింది.
 -పి. రవిచంద్రకుమార్, సిమెంటు వ్యాపారి
 
 కొత్తపనులు మొదలు కావడం లేదు

 భవన నిర్మాణ సామగ్రి ధరలు పెరిగి పోతుండటంతో కొత్త పనులు మొదలు కావడం లేదు. భవన నిర్మాణ పనుల్ని వృత్తిగా ఎంచుకున్న కూలీలకు ఉపాధి దొరకడం లేదు. ధరలను ప్రభుత్వం నియంత్రించాలి. ఆర్థిక స్తోమత ఉన్నవారు మాత్రమే పనులు కొనసాగిస్తున్నారు. పూర్తి స్థాయిలో పనులు లేకపోవడంతో ఇబ్బందిగా ఉంది.
  - ఊట్ల శివ, తాపి మేస్త్రీ

మరిన్ని వార్తలు