డ్రెస్‌ కోడ్‌ వచ్చేసింది..

2 Jan, 2019 12:17 IST|Sakshi

దుర్గమ్మ దర్శనానికి సంప్రదాయ వస్త్రాలు

దుర్గగుడిలో డ్రస్‌కోడ్‌ అమలు

అందరికీ ఆమోదమేనన్న భక్తులు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): జీన్స్, టీ షర్టులను ధరించిన యువతులే...కాదు పంజాబీ డ్రస్‌పై చున్నీ లేని యువతులు సైతం తెలుగు వారి సంప్రదాయ పద్ధతికే ఆమోద ముద్ర వేశారు. ఆంగ్ల సంవత్సరాది నుంచి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో డ్రస్‌ కోడ్‌ను అమలు చేయగా, ఆలయ అధికారుల నిర్ణయానికి భక్తులు ఆమోద ముద్ర వేశారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసిన భక్తులు దేవస్థానంలో అమలు చేస్తున్న డ్రస్‌ కోడ్‌ బాగుందని కితాబు ఇచ్చారు. ఆధునిక డ్రస్‌లలో వచ్చిన యువతులు, మహిళలు దేవస్థానం విక్రయించిన చీరలను కొనుగోలు చేసి సంప్రదాయ పద్ధతిలో దుర్గమ్మను దర్శించుకున్నారు. కేవలం చీరలే కాకుండా పంజాబీ డ్రస్‌పై చున్నీ లేని వారికి కూడా అమ్మవారి దర్శనానికి అనుమతించకపోవడంతో యువతులందరూ కలిసి చీరను కొనుగోలు చేసి చున్నీలుగా ధరించారు.

రూ.100లకే అమ్మవారి చీర
డ్రస్‌ కోడ్‌ అమలు చేస్తున్న దుర్గగుడి అధికారులు భక్తుల కోసం దేవస్థానమే రూ.100లకు చీరను విక్రయించింది. వినాయకుడి గుడి నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్ల వద్ద ఆధునిక డ్రస్‌లు వేసుకుని అమ్మవారి దర్శనానికి వచ్చే వారికి డ్రస్‌ కోడ్‌ గురించి తెలియజేశారు. భక్తులు దేవస్థానం విక్రయిస్తున్న రూ.100 చీరలను కొనుగోలు చేసి వాటిని ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు. పంజాబీ డ్రస్‌పై చున్నీ లేకపోవడంతో కొంతమందికి సిబ్బంది అడ్డు చెప్పగా, వారందరూ కలిసి ఒక చీరను కొనుగోలు చేసి, దానిని చున్నీగా కట్‌ చేసుకుని ధరించడం కనిí ³ంచింది. 

డ్రస్‌ కోడ్‌ బాగుందని కొంతమంది విద్యార్థినులు పేర్కొన్నారు. డ్రస్‌ కోడ్‌ పాటించి అమ్మవారిని దర్శించుకున్న కొంత మంది యువతులు, కళాశాల విద్యార్థినులతో దేవస్థాన ఈవో వీ.కోటేశ్వరమ్మ మాట్లాడారు. ముంబయి, మహా రాష్ట్ర, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల నుంచి విచ్చేసిన భక్తులు చీరలను ధరించి ఆలయ ప్రాంగణంలో ఫొటోలు, సెల్ఫీలు దిగడం కనిపించింది. చీర «గురించి ఎప్పుడూ తెలియని వారు కూడా ధరించారు.

మరింత ప్రచారం కల్పించాలి.. 
సంప్రదాయ వస్త్రాలను ధరించి అమ్మవారిని దర్శించుకోవడం బాగుంది.. డ్రస్‌ కోడ్‌పై మరింత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. కేవలం దేవస్థాన పరిసరాలలోనే కాకుండా నగరంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్‌తో పాటు ప్రధాన కూడళ్లలో బోర్డులు ఏర్పాటు చేయాలి.
కాటం సాయిశిరీష, ఇంజనీరింగ్‌ విద్యార్థిని

ఈవోనే మాకు చీర ఇచ్చారు...
కొత్త సంవత్సరం నుంచి డ్రస్‌ కోడ్‌ అనే విషయం మాకు తెలియదు. గుడికి వచ్చిన మాకు ఈవో గారు చీరను ఇచ్చారు. చీరతో మా ఫ్రెండ్‌కు ఓనీ, నాకు చున్నీగా చేసుకున్నాం. అమ్మవారి దర్శనానికి అందరూ సంప్రదాయ దుస్తులలోనే వస్తే బాగుంటుంది. ఆలయాలలో సంప్రదాయాలను పాటించడం మనందరి బాధ్యత.
శ్రావ్య, ఇంజినీరింగ్‌ విద్యార్థిని

మరిన్ని వార్తలు