యురేనియం తవ్వకాలతో నీరు కలుషితం

31 Dec, 2013 03:30 IST|Sakshi

 వేముల, న్యూస్‌లైన్: యురేనియం తవ్వకాలతో మండలంలోని మబ్బుచింతలపల్లె గ్రామంలోని మంచినీటి పథకం తాగునీరు కలుషితమవుతోంది. గత 20రోజులుగా బోరులో నుంచి కలుషితనీరు వస్తోంది. వర్షాలతో అలా వస్తోందనుకుని బోరు లోతు తగ్గించారు. అయినా నీటిలో ఏ మాత్రం మార్పు లేదు. నీటి మోటారు ఆన్‌చేసి రోడ్డుపైకి నీరు వదలితే కొద్దిసేపటికే రోడ్డుపై వ్యర్థ పదార్థం పేరుకపోతోంది. గ్రామస్తులు యురేనియం అధికారుల దృష్టికి తీసుకురాగా మైన్స్ మేనేజర్ కె.కె.రావు, మైనింగ్ డిప్యూటీ సూపరింటెండెంటు భద్రాదాస్ గతవారం గ్రామానికి వె ళ్లి నీటిని పరిశీలించారు.  ఎటువంటి సమాధానం ఇవ్వకుండా వెనుతిరుగుతుండగా గ్రామస్తులు అడ్డుకుకి హామీ ఇచ్చేవరకు వెళ్లనీయమని పట్టుబట్టారు. పర్సనల్ మేనేజర్ ఆలీ అక్కడికి చేరుకొని నీటిని పరీక్షలకు పంపుతామని, అప్పటివరకు ట్యాంకర్లతో అందిస్తామని హామీ ఇచ్చారు.
 
 పరిశోధనలో బయటపడిన వాస్తవాలు
 మబ్బుచింతలపల్లె తాగునీటి బోరు నుంచి సేకరించి నీటిని ల్యాబ్‌కు పంపించి పరీక్షలు నిర్వహించారు. ఆ బోరులోని తాగునీరు పూర్తిగా కలుషితమైందని, నీరు తాగేందుకు పనికిరావని పరిశోధనలో తెలిసింది. అండర్ మైనింగ్ బోరుకు సమీపంలోనే తవ్వకాలు సాగుతున్నాయని, దీంతో మైనింగ్‌లోని వ్యర్థ పదార్థం మంచినీటి బోరులోకి వెళ్లి నీరు కలుషితమైందని పరిశోధనలో తేలినట్లు సమాచారం. గ్రామంలోని బోరు నీరు కలుషితమైనందున ప్రత్యామ్నాయంగా  దోబీఘాట్ వద్ద బోరువేసి తాగునీరు ఇవ్వాలని గ్రామస్తులు అంటున్నారు.  అధికారులు పట్టించుకోకపోతే యురేనియం ఉత్పత్తిని స్తంభింపజేస్తామని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు