తాగునీరు కలుషితం..50 మందికి అస్వస్థత

5 Mar, 2018 08:45 IST|Sakshi
జీజీహెచ్‌లో చికిత్సపొందుతున్న బాధితులు

వాంతులు, విరేచనాలతో పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు

వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన నగరపాలక సంస్థ

నగరంపాలెం(గుంటూరు): గుంటూరు నగరంలో తాగునీరు కలుషితమై 50 మంది అస్వస్థతకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. నగరపాలక సంస్థ పరిధిలోని సంగడిగుంట లాంచెస్టర్‌ రోడ్డు పరిసర ప్రాంతాల్లోని మంత్రివారి వీధి, చిటికెల వారి వీధీ, రెడ్ల బజారు తదితర ప్రాంతాల్లోని వార్డులతో పాటు ఆనందపేట, పొన్నూరు రోడ్డులో పలువురు ఆదివారం విరోచనాలు, వాంతులతో గుంటూరు జీజీహెచ్, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు.  శనివారం ఉదయం వచ్చిన మంచినీరు తాగటం వలన అస్వస్థతకు గురైనట్లు పలువురు బాధితులు తెలుపుతున్నారు.

ఆదివారం ఉదయం నీళ్ల విరోచనాలు, వాంతులు అవటంతో నీరిసించి అస్వస్థతతో  20 నుంచి 25 మంది వరకు సంగడిగుంట లాంచెస్టర్‌ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉండడంతో  ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మురుగునీటి కాల్వ మీద నుంచే మంచి నీరు  సరఫరా అవుతుండడంతో అక్కడక్కడ లీకులు వలన నీరు కలుషితం అవుతుందన్నారు. విషయం తెలుసుకున్న  నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనూరాధ, ఇంజనీరింగ్, ప్రజారోగ్యశాఖ అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నగరపాలక సంస్థ ఎంహెచ్‌వో డాక్టర్‌ శోభారాణి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు లక్ష్మయ్య బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్ళి వివరాలు సేకరించారు.  కమిషనర్‌ ఆదేశంతో సంగడిగుంటలోని  వడ్డేగూడెం మున్సిపల్‌ పాఠశాలలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి  ఉచితంగా మందులు పంపిణీ చేశారు.   

మరిన్ని వార్తలు