తాగునీటి కోసం ఆందోళన

7 Mar, 2019 15:01 IST|Sakshi
 రోడ్డు పనులను అడ్డుకుంటున్న అనమనమూరు మహిళలు 

సాక్షి,మేదరమెట్ల( ప్రకాశం) : వేసవి ఆరంభంలోనే తాగునీటి కోసం ప్రజలు రోడెక్కాల్సిన దుస్థితి నెలకొంది. దీనికి ఉదాహరణ కొరిశపాడు మండలంలోని అనమనమూరు ముంపు గ్రామంలోని కొంతమందికి బొడ్డువానిపాలెం కొండసమీపంలో పునరావాసం  ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఉంటున్నారు. గ్రామానికి తాగునీటి సరఫరా చేస్తున్న పైపులైను పది రోజుల క్రితం పగిలిపోవడంతో ఆ కాలనీ ప్రజలు, బొడ్డువానిపాలెం ఎస్సీకాలనీ వారు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేదరమెట్ల నుంచి అద్దంకి వెళ్లే  రాష్ట్రీయ రహదారి నాలుగులైన్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి.

ఇదే రోడ్డు పక్కన బొడ్డువానిపాలెం గ్రామానికి తాగునీటి సరఫరా చేసే పైపులైను ఉంది. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా ఇప్పటికే ఐదుసార్లు ఈ పైపులైను మరమ్మతులకు గురైందని, ప్రతిసారి తాము కొంతసొమ్ముతో మరమ్మతులు చేయించుకుంటున్నట్లు కాలనీ వాసులు చెపుతున్నారు. పదిరోజుల కిందట సుమారు 300 అడుగుల మేర తాగునీటి సరఫరాచేసే పైపులైను రోడ్డునిర్మాణంతో పూర్తిగా దెబ్బతింది. విషయం కాంట్రాక్టర్‌ దృష్టికి తీసుకుపోయారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే మేదరమెట్ల వచ్చిన సమయంలో విన్నవించుకున్నా తమ గోడు పట్టించుకోవలేదని కాలనీ వాసులు వాపోయారు.

పనులు అడ్డుకున్న మహిళలు
తాగునీటి పైప్‌లేన్‌ మరమ్మతుల విషయం ఎవరూ పట్టించుకుకోకపోవడంతో కాలనీకి చెందిన మహిళలు అద్దంకి రోడ్డులో నిర్మాణం చేస్తున్న పనులను బుధవారం మహిళలు అడ్డుకున్నారు. దీంతో సంబంధిత కాంట్రాక్టర్‌ రెండు, మూడు రోజుల్లో పైపులైను మరమ్మతులు చేయించడం జరుగుతుందని కాలనీవాసులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఇటీవల ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కాలనీలోని చేతి పంపులు, బోర్లు పూర్తిగా అడుగంటిపోయాయని, పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం వల్ల తామే ట్యాంకర్‌ను ఏర్పాటు చేసుకొని  తాగునీటి సరఫరా చేసుకుంటున్నట్లు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బొడ్డువానిపాలెం, అనమనమూరు ముంపు కాలనీకి తాగునీటి సమస్యపై శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని ఆప్రాంత ప్రజానీకం కోరుతున్నారు.

మరిన్ని వార్తలు