తల నొప్పిని భరించి.. ప్రయాణికులను కాపాడిన డ్రైవర్‌

29 Nov, 2019 11:10 IST|Sakshi
బస్సుముందు  తలనొప్పితో విలవిల్లాడుతున్న డ్రైవర్‌  రవికిరణ్‌

సాక్షి, అమరావతి: ఆ బస్సు గుంటూరు నుంచి అమరావతికి బయలుదేరింది. మరో ఆరు కిలో మీటర్లు ప్రయాణిస్తే గమ్యస్థానం చేరుతుంది. ఉన్నట్టుండి బస్సు అదుపు తప్పింది.. స్టీరింగ్‌పై డ్రైవర్‌ చేతులు ఉన్నా నియంత్రణ చేయలేకపోతున్నాడు.. భరించలేని తలనొప్పి, కళ్లు బైర్లుకమ్మడంతో డ్రైవింగ్‌పై దృష్టిపెట్టలేకపోయాడు.. బస్సు రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళ్లడం.. కనుచూపు మేరలోనే కొండవీటివాగుపై బ్రిడ్జి కనిపించడం, బస్సుపై డ్రైవర్‌ నియంత్రణ లేపోవడం.. గమనించిన ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. వారి అరుపులతో స్పృహలోకి వచ్చిన డ్రైవర్‌ బస్సును పక్కకుతీసి ఆపడంతో ప్రయాణికులు ఊరిపీల్చుకున్నారు. నొప్పి భరించలేని డ్రైవర్‌ సీటులో కూర్చోలేక రోడ్డుపై పడుకుని తల్లడిల్లాడు. డ్రైవర్‌ను ప్రయాణికుల సాయంతో బస్సు కండక్టర్‌ అమరావతి సీహెచ్‌సీకి తరలించాడు.
 
బస్సు కండక్టర్‌ కుమారి, ప్రయాణికుల కథనం మేరకు.. గుంటూరు నుంచి అమరావతిగుడి సర్వీసు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ రవికిరణ్‌ మధ్యాహ్నం భోజనం తరువాత ఆరోగ్యం బాగాలేదని బస్టాండులో ఆర్టీసీ సంస్థకు చెందిన డాక్టర్‌కు చూపించుకున్నారు. డాక్టర్‌ పారాసిటమాల్‌ మాత్రలు ఇచ్చి పంపించారు. అనంతరం రవికిరణ్‌ డ్యూటీ ఎక్కాడు. బస్సు గుంటూరు నుంచి అమరావతి వస్తుండగా తాడికొండ అడ్డరోడ్డు దగ్గర తనకు తలనొప్పిగా ఉందని రవికిరణ్‌ కండక్టర్‌ కుమారికి చెప్పారు. తీరా ఎండ్రాయి వద్దకు వచ్చేసరికి రవికిరణ్‌ తలనొప్పిని తట్టుకోలేక తల్లడిల్లాడు. కళ్లు బైర్లుకమ్మడంతో స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు రోడ్డుకు అడ్డదిడ్డంగా వెళ్లడంతో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులు భయపడ్డారు.

కొండవీటి వాగుపై ఉన్న వంతెన ఎదురుగా కనిపించడంతో ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనని హాహాకారాలు చేశారు. వారి అరుపులకు తేరుకున్న రవికిరణ్‌ బస్సును పక్కకుతీసి నిలిపాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం డ్రైవర్‌ను అమరావతి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందిన అనంతరం డ్రైవర్‌ కోలుకున్నాడు. కోలు కున్న రవికిరణ్‌ మాట్లాడుతూ తనకు ఆరోగ్యం బాగాలేదని ఆర్టీసీ డాక్టర్‌ వద్దకు వెళ్తే పారాసిటమల్‌ మాత్రలు ఇచ్చి పంపించారని, ఒక మాత్ర వేసుకుని డ్యూటీకి వచ్చానని చెప్పాడు.  

    

మరిన్ని వార్తలు