ఎట్టకేలకు డీఆర్వో పోస్టు భర్తీ

29 Dec, 2015 00:59 IST|Sakshi

చంద్రశేఖరరెడ్డికి లైన్ క్లియర్
రేపు బాధ్యతల స్వీకరణ

 
విశాఖపట్నం :  ఆదినుంచి వివాదాస్పదమైన జిల్లా రెవెన్యూ అధికారి నియామకం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. గతంలో ప్రభుత్వం నియమించిన చంద్రశేఖర్‌రెడ్డికి లైన్‌క్లియర్ అయింది. ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌కు సమాచారం అందింది. డీఆర్‌వోగా పనిచేస్తున్న కె.నాగేశ్వరరావును అన్నవరం దేవస్థానం ఈవోగా ఈ ఏడాది జూలైలో ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఈ పోస్టును భర్తీ చేసేందుకు సర్కారు చేసిన ప్రయత్నాలు మంత్రుల మధ్య బేధాభిప్రాయాలతో బెడిసికొట్టాయి. గతంలో డీఆర్‌వోగా పనిచేసిన నరిసింహారావు మళ్లీ   ఇదే పోస్టుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేయగా జిల్లా ఉన్నతాధికారి విముఖత వ్యక్తంచేయడం, మంత్రులు ఆసక్తి చూపకపోవడంతో చివరకు ఆయన ఎస్‌ఈజెడ్ ఆర్‌అండ్ ఆర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా విధుల్లో చేరారు. ఆగస్టులో చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా కడప జేసీ -2గా పనిచేస్తున్న చంద్రశేఖర్‌రెడ్డిని విశాఖ డీఆర్‌వోగా ప్రభుత్వం నియమించింది. కానీ మంత్రుల మధ్య ఏర్పడిన బేధాభిప్రాయాల కారణంగా ఆయన విధుల్లో చేరలేకపోయారు.  తరువాత తెలంగాణ నుంచి రాష్ట్రానికి కేటాయించగా విశాఖ ఆర్‌డీవోగా తొలి పోస్టింగ్ పొందిన వెంకటేశ్వర్లను డీఆర్‌వోగా నియమిస్తూ ప్రభుత్వం సెప్టెంబర్ 19న ఉత్తర్వులు విడుదల చేసింది.

ఈ జీవో వచ్చిన 24 గంటలు తిరగకుండానే జీవోను పెండింగ్‌లో పెడుతున్నట్లు మరో జీవో ఇచ్చి వెంకటేశ్వర్ల నియామకానికి బ్రేక్‌లు వేశారు. వెంకటేశ్వర్ల నియామకం విషయంలో కూడా జిల్లాకు చెందిన ఓ మంత్రి అభ్యంతరం వ్యక్తంచేయడంతో డీఆర్‌వో పోస్టు భర్తీ కాకుండా ఆగిపోయింది. కడప జేసీ -2గా పనిచేస్తూ అక్టోబర్‌లో రిలీవైన చంద్రశేఖర్‌రెడ్డి పరిపాలనా కమిషనర్‌కు రిపోర్టు చేసినప్పటికీ విశాఖ డీఆర్‌వోగా మాత్రం పోస్టింగ్ పొందలేకపోయారు. అప్పటి నుంచి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఆయన విషయంలో మంత్రులు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. చివరుకు సీఎం పేషీ జోక్యం చేసుకోవడంతో పాటు రాష్ట్ర రెవెన్యూ ఉన్నతాధికారులు సైతం మంత్రులతో మాట్లాడంతో   చంద్రశేఖర్‌రెడ్డి నియామకానికి   లైన్ క్లియర్ ఇచ్చినట్లు సమాచారం.  
 

మరిన్ని వార్తలు