సీఎంకు రుణపడి ఉంటా..

20 Jul, 2019 13:24 IST|Sakshi

రాజధానికి దీటుగా నగరాభివృద్ధి

ప్రజల భాగస్వామ్యంతోనే నగర వెలుగులు 

వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ద్రోణంరాజు శ్రీనివాస్‌

సంబరంగా పదవీ బాధ్యతల స్వీకరణ

రెండు ప్రతిష్టాత్మక సంస్థల సారథులు కొలువుదీరారు. నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించిన వీఎంఆర్డీయే చైర్మన్‌గా నియమితులైన ప్రభుత్వ మాజీ విప్‌ ద్రోణంరాజు శ్రీనివాస్, ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌గా అదనపు బాధ్యతలు పొందిన ప్రొఫెసర్‌ పి.వి.జి.డి.ప్రసాద్‌రెడ్డిలు శుక్రవారం ఆయా సంస్థల కార్యాలయాల్లో అభిమానులు, సిబ్బంది కోలాహలం మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సంస్థల పాలనను, ప్రగతిని కొత్త పుంతలు తొక్కిస్తామని ఈ సందర్భంగా వారు చెప్పారు.

సాక్షి, విశాఖ సిటీ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్న కృతనిశ్చయంతో ఉన్నారని విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(వీఎంఆర్డీఏ) చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ వెల్లడించారు. సంస్థ ద్వారా ఏ ప్రాజెక్ట్‌ మొదలుపెట్టినా ప్రజాశ్రేయస్సే అంతిమ లక్ష్యంగా పనిచేయాలని సీఎం సూచించారన్నారు. ప్రతిష్టాత్మక వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా ద్రోణంరాజు శ్రీనివాస్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్స్‌ కాలనీలోని తన నివాసం నుంచి వేలాది మంది కార్యకర్తల నడుమ ఊరేగింపుగా తరలివచ్చిన ద్రోణంరాజు వుడా చిల్డ్రన్‌ థియేటర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వీఎంఆర్‌డీఏ కార్యాలయానికి చేరుకుని మూడో అంతస్తులోని తన చాంబర్‌లో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. వీఎంఆర్‌డీఏ ఉద్యోగుల 27 శాతం ఐఆర్‌ ఫైల్‌పై తొలి సంతకం చేయగా, రహదారుల అభివృద్ధి, జీవీఎంసీ, పోలీస్‌శాఖల సమన్వయంతో హైవేపై ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ ప్రణాళిక ఫైల్‌పై రెండో సంతకం చేశారు. సంస్థ ఇన్‌చార్జి కమిషనర్, జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ద్రోణంరాజుకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. 

జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి
జీవీఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎంకు కానుకగా ఇవ్వాలని ద్రోణంరాజు అన్నారు. ప్రజాప్రతినిధులు అసెంబ్లీ, పార్లమెంట్‌ సమావేశాల కారణంగా ఈ కార్యక్రమానికి అందుబాటులో లేరని చెప్పారు. అతిత్వరలో నగరంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సమక్షంలో 25 వేల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి ఎలా పనిచేస్తున్నారో.. ఆయన అడుగుజాడల్లో రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాస్, మోపిదేవి వెంకటరమణ సహకారంతో పనిచేసి విశాఖను పారిశ్రామిక హబ్‌గా, ఆర్థిక రాజదానిగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషిచేస్తామని తెలిపారు.   

త్వరితగతిన ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్‌ పూర్తి చేస్తాం
ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్‌ వంతెన నిర్మాణం నిర్ణీత సమయంలో పూర్తి చేయడమే తమ ముందున్న ప్రథమ కర్తవ్యమని ద్రోణంరాజు అన్నారు. నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణ దాదాపు ఈ వంతెనపైనే అధారపడి ఉందన్నారు. కైలాసగిరి పార్కు నిర్మాణం, ముడసర్లోవ ఆధునీకరణ, ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియం, ఇతర ప్రాజెక్ట్‌లను త్వరితగతిన పూర్తి చేయడానికి సన్నద్ధమవుతున్నామన్నారు. బీచ్‌ నవీకరణ పనులకు శ్రీకారం చుడతామని చెప్పారు. మధురవాడ ప్రాంతంలో ఐటీ సెక్టార్‌ అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు. మధ్య తరగతి ప్రజలందరికీ గృహయోగం కల్పించేలా సంస్థ ముందడుగు వేస్తుందన్నారు. ప్రభుత్వం ద్వారా ప్రతీ పేదోడికి ఇళ్లు లభించేలా కృషి చేస్తామన్నారు. వీఎంఆర్‌డీఎ ఉద్యోగులపై అజమాయిషీ ఉండదని, పరస్పర సహకారంతో స్నేహపూర్వక వాతావరణంలో కలిసి పనిచేస్తామన్నారు.

వీఎంఆర్‌డీఎ ఇన్‌చార్జి కమిషనర్‌ జి.సృజన, కార్యదర్శి ఏ.శ్రీనివాస్,  వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు సిహెచ్‌ వంశీకృష్ణ శ్రీనివాస్, సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, కె.కె రాజు, అక్కరమాని విజయనిర్మల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, కార్యదర్శులు సత్తి రామకృష్ణారెడ్డి, చొక్కాకుల వెంకటరావు, రాష్ట్ర అధికార ప్రతినిధులు కొయ్య ప్రసాద్‌రెడ్డి, జాన్‌ వెస్లీ, అదనపు కార్యదర్శులు జి.రవిరెడ్డి, పక్కి దివాకర్,మొల్లి అప్పారావు, పేర్ల విజయంచదర్, దేవన్‌రెడ్డి సంయుక్త కార్యదర్శి బయిలపూడి భగవాన్‌ జయరామ్, మాజీ వుడా చైర్మన్‌ పిఎస్‌ఎన్‌రాజు(రవి), మరియాదాస్,  నగర అనుబంద విభాగాల అధ్యక్షులు గరికిన గౌరీ, పీలా వెంకటలక్ష్మి, బోని శివరామకృష్ణ, రామన్నపాత్రుడు,శ్రీనివాస్‌రెడ్డి, యువ శ్రీ, రాధ, శ్రీనివాస్‌గౌడ్, బర్కత్‌ ఆలీ, పరూఖీ,  ఆల్ఫా కృష్ణ, శ్యాంకుమార్‌రెడ్డి, ముఖ్యనాయకులు శ్రీదేవివర్మ, పద్మారెడ్డి, మళ్ల ధనలత, పళ్లా చినతల్లి, వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు.

సీఎంకు రుణపడి ఉంటా..
సార్వత్రిక ఎన్నికల్లో తాను ఓటమి చెందినా తనపై విశ్వాసంతో ఈ పదవి అందించి తనకు రాజకీయ పునర్జన్మ ఇచ్చిన సీఎంకు రుణపడి ఉంటానని ద్రోణంరాజు అన్నారు. సరిగ్గా 40 ఏళ్ల క్రితం వుడాకు తన తండ్రి ద్రోణంరాజు సత్యనారాయణ, వీఎంఆర్‌డీఎకు తనను తొలి చైర్మన్‌గా నియమించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. వీఎంఆర్‌డీఏ ప్రతిష్టను పెంచేందుకు అనుక్షణం పనిచేస్తాన్నారు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన ప్రజా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. అటువంటి వ్యక్తికి చెడ్డ పేరు తీసుకువచ్చే పని ఏది చేయవద్దని కార్యకర్తలకు సూచించారు. నవరత్నాల పథకాలను ప్రతి ఇంటికీ చేరేలా కృషిచేయాలని, ప్రజల హృదయాలను గెలుచుకోవాలన్నారు.  

>
మరిన్ని వార్తలు