‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు’

13 Jul, 2019 19:35 IST|Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత ద్రోణంరాజు శ్రీనివాసరావును విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప‍్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీఎంఆర్డీఏ చైర్మన్‌గా నియమించడంపట్ల ద్రోణంరాజు శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ద్రోణంరాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో ఓడిపోయినా సరే ప్రజలకు సేవ చేసేవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వీఎంఆర్డీఏ వంటి పెద్దసంస్థకు చైర్మన్‌గా నియమించడం వైఎస్ జగన్ ఔన్నత్యానికి, గొప్పతనానికి నిదర్శనం. నామీద పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తాను. నగరాభివృద్ధి, పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తాను. మొట్టమొదట వుడా వ్యవస్థాపక అధ్యక్షునిగా మాతండ్రిని నాటి సీఎం చెన్నారెడ్డి నియమించారు. ఆ తర్వాత వుడా పరిధి పెంచి వీఎంఆర్డీఏగా ఏర్పడిన తర్వాత నన్ను తొలి చైర్మన్‌గా సీఎం వైఎస్ జగన్ నియమించడం గొప్ప విషయం.
(చదవండి : వీఎండీఆర్‌ఏ చైర్మన్‌గా ద్రోణంరాజు శ్రీనివాస్‌)

నగరపాలక సంస్థతో పాటు వీఎంఆర్డీఏ పరిధిలో ఉన్న అన్ని జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తా. ల్యాండ్ పూలింగ్‌లో అనేక అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. ఈ విషయంలో వైఎస్ జగన్ సముచిత నిర్ణయం ప్రకారమే పనిచేస్తాం. నగరాభివృద్ధి గురించి పనిచేసే కొన్ని ప్రజాసంఘాల సలహాలను తీసుకుంటాం. 150 మంది ఎమ్యెల్యేలు ఉండగా సీఎం వైఎస్ జగన్ నన్ను గుర్తించి పదవి ఇవ్వడం గొప్పతనం. అందరికీ ఇళ్లు అందేలా, నవరత్నాలను ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్తాను. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ సౌత్‌ నుంచి పోటీ చేసిన ద్రోణంరాజు టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్‌ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆయన గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు