నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో డ్రోన్‌ ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌

30 Nov, 2019 05:03 IST|Sakshi

కర్నూలులో డ్రోన్‌ ప్లగ్‌ అండ్‌ ప్లే కేంద్రం 

ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ సీఈవో వెల్లడి

సాక్షి, అమరావతి: డ్రోన్లపై జరుగుతున్న పరిశోధనలకు చేయూతనిచ్చేందుకు నూజివీడులోని ట్రిపుల్‌ ఐటీలో డ్రోన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు  ఏపీ డ్రోన్స్‌ కార్పొరేషన్‌ సీఈవో ఆళ్ల రవీంద్ర రెడ్డి తెలియజేశారు. డ్రోన్‌ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఇన్వెస్ట్‌మెంట్‌ పాలసీని రూపొంది స్తున్నట్లు శుక్రవారం ఆయన ‘సాక్షి’కి తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడం కోసం కర్నూలు జిల్లాలో ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో సుమారు 100 ఎకరాల్లో ఒక డ్రోన్‌ పార్కును ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు చెప్పారు.

అమెరికాకు చెందిన ప్రముఖ డ్రోన్‌ తయారీ కంపెనీ డీజేఐ రాష్ట్రంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందన్నారు. రాష్ట్రంలో సుమారు 600 డ్రోన్లను వినియోగిస్తున్నట్లు అనధికారిక అంచనాగా ఉందని, అయితే వీటి వినియోగానికి సంబంధిత జిల్లా ఎస్పీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని రవీంద్రరెడ్డి స్పష్టం చేశారు. డ్రోన్ల వినియోగంపై ఆపరేటర్లకు అవగాహన కల్పించేందుకు డిసెంబర్‌ రెండో వారంలో రాష్ట్రస్థాయి శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు