‘అనంత’లో డ్రోన్‌ ప్రయోగాలు

7 Jun, 2020 03:48 IST|Sakshi

ఏపీకి చెందిన వాల్యూథాట్, కర్ణాటకకు చెందిన ఇన్‌ డ్రోన్స్‌ కలిసి ప్రయోగాలు 

ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌తో ఒప్పందం

సాక్షి, అమరావతి: సుదీర్ఘ ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా అత్యవసర మందులు, ఇతర వస్తువులను సరఫరా చేసే పరీక్షలకు అనంతపురం జిల్లా వేదిక కానుంది. దేశంలోనే తొలిసారిగా కంటికి కనిపించనంత దూరంగా (బీవీఎల్‌వోఎస్‌) డ్రోన్‌లను పరీక్షించేందుకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ అనుమతులిచ్చింది. రాష్ట్రానికి చెందిన వాల్యూథాట్‌తో పాటు కర్ణాటకకు చెందిన ఇన్‌ డ్రోన్స్‌ సంస్థలు కన్సా ర్షియంగా ఏర్పడి ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌తో కలిపి అనంతపురం జిల్లా పుట్టపర్తి సమీపంలో ఈ ప్రయోగాలు నిర్వహించనున్నాయి.

డ్రోన్‌కు సుమారు 8 కిలోల బరువున్న వస్తువులను అమర్చి 27.5 కి.మీ దూరం రిమోట్‌ సాయంతో పంపి పరీక్షలు నిర్వహించనున్నట్లు వాల్యూ థాట్‌ సీఈవో మహేష్‌ అనిల్‌ నంద్యాల ‘సాక్షి’కి వివరించారు. జీపీఎస్‌ ద్వారా డ్రోన్‌ తీసుకెళ్లిన వస్తువులను నిర్దేశిత గమ్యానికి సురక్షితంగా చేర్చి తిరిగి వచ్చిందా లేదా పర్యవేక్షిస్తామని, ఈ విధంగా 100 గంటలు ప్రయోగం చేయాల్సి ఉంటుందని సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వంశీ మాదిరెడ్డి తెలిపారు. ఈ ప్రయోగాలకు అనుమతులు, ఏర్పాట్లను ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ అందిస్తుంది. పుట్టపర్తి ఎయిర్‌పోర్టు సమీపంలోని ఒక ప్రభుత్వ రంగ సంస్థ స్థలాన్ని ప్రయోగానికి వేదికగా నిర్ణయించారు. ఈ నెలాఖరు నుంచి పరీక్షలు జరుగుతాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రకృతి విపత్తులు, సరిహద్దుల రక్షణ, అత్యవసర మందులు, ఆహార సరఫరా వంటి కార్యక్రమాల్లో డ్రోన్స్‌ను విరివిగా వినియోగించుకోవచ్చు.
 

>
మరిన్ని వార్తలు